Rajnath Singh: పాకిస్థాన్‌కు IMF భారీ ఆర్థిక సాయం.. రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్!

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) మరోసారి అండగా నిలిచింది. ఈ మేరకు దాదాపు 1 బిలియన్ డాలర్లకు పైగా (రూ. 8,000 కోట్లు) ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. పాకిస్థాన్ నిర్దేశిత ఆర్థిక లక్ష్యాలను చేరుకుందని పేర్కొంటూ, ఈ సహాయాన్ని IMF విడుదల చేసింది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఆర్థిక సాయం కలకలం రేపుతోంది.

ఈ మేరకు ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలీ కొజాక్ మాట్లాడుతూ, పాకిస్థాన్ సంస్కరణల పరంగా కొంత పురోగతి సాధించిందని, అందుకే బోర్డు నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. మే 9న బోర్డు సమీక్ష అనంతరం ఈ ఫండ్లు విడుదలైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌కు ఇప్పటికే ఈఎఫ్ఎఫ్ పథకం కింద 2.1 బిలియన్ డాలర్లు రెండు విడతల్లో అందాయి. మొత్తం రూ. 7 బిలియన్ డాలర్ల ఒప్పందం కింద ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాకిస్థాన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి వేదికగా మార్చుకుంటోందని ఆయన ఆరోపిస్తూ, అలాంటి దేశానికి ఆర్థిక సాయం చేయడం నేరపూరిత కార్యకలాపాలకు పరోక్షంగా నిధులు సమకూర్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఇందువల్ల భారత్ IMFకు వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా, తాజా విడత ఫండ్ల కోసం IMF పాకిస్థాన్‌పై 11 కీలక షరతులు విధించింది. విద్యుత్ బిల్లులపై అదనపు రుసుములు, పాత కార్ల దిగుమతులపై ఆంక్షల తొలగింపు, 2035 నాటికి పారిశ్రామిక ప్రోత్సాహకాల తొలగింపు వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. అంతేకాక, భారత్‌తో ఉద్రిక్తతలు పెరిగితే పథకం లక్ష్యాలే ఛేదించబడ్డవన్న హెచ్చరికలు కూడా IMF నుంచి వచ్చాయి.

Public Reaction On YS Jagan Warning To Chandrababu Govt || Ap Public Talk || Pawan Kalyan || TR