Crime News:హైదరాబాద్ లోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల వంశీకృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతుడు రాసిన రెండు సూసైడ్ నోట్లు పోలీసులకు దొరికాయి. ఒకదాంట్లో కాలేజీలో తనను లైంగిక వేధింపులకు గురి అవుతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్టు రాశాడు. మరొక దాంట్లో బ్లడ్ క్యాన్సర్ వల్ల తన ఆరోగ్యం నిలకడగా ఉండటం లేదు అని రాశాడు. అయితే ఈ రెండు సూసైడ్ లెటర్లు బయటకు రాకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని, ఫోన్లో తీసిన ఫోటోలను బలవంతంగా పోలీసులు డిలీట్ చేపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లా చారకొండ గ్రామానికి చెందిన లింగారం లక్ష్మయ్య-సువర్ణ ల రెండవ కుమారుడు వంశీకృష్ణ హైదరాబాద్ లోని గౌలిదొడ్డి గురుకుల కాలేజీ లో ఇంటర్ ఫస్టియర్ (బైపీసీ) చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి పది గంటల వరకు తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నారు. అనంతరం అందరూ నిద్రిస్తున్న సమయంలో క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకున్నాడు. ఉదయం డ్రిల్ వహిస్తుండగా వంశీకృష్ణ రాలేదని గమనించిన తోటి విద్యార్థులు అతడి కోసం వెతికారు. ఈ క్రమంలో ఒక రూమ్ లోపల నుండి లాక్ చేసి ఉండటం గమనించిన వారు డోర్ బద్దలుకొట్టి చూడగా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ రూమ్ లో వంశీకృష్ణ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు.
వెంటనే ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకి దించారు. వంశీకృష్ణ ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. కాలేజీ లోనీ విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. లైంగిక వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నాను అని వంశీకృష్ణ రాయడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. వంశీకృష్ణ మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన అతని తల్లిదండ్రులు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ కేసును చేధించే క్రమంలో నిమగ్నమయ్యారు.