పవర్ పాలిటిక్స్ బాగా అలవాటున్న నేతల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. విశాఖలో ఎక్కడి నుండైనా పోటీచేసి గెలవగలిగిన గంటా అధికారం లేని పార్టీలో ఎక్కువ కాలం ఉండలేరు. ఆయన పొలిటికల్ జర్నీ చూస్తే ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఆయన పార్టీలు మారే తీరు కూడ అందరికంటే డిఫరెంట్. గోడ దూకాలని నిర్ణయించుకున్న నేతలు ఎవరైనా సరే రాత్రికి రాత్రి పార్టీ మార్చేస్తారు. ఈరోజు సాయంత్రం పార్టీలోనే ఉన్నామని చెప్పి పొద్దుటికల్లా నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చింది అనేస్తారు. కొందరైతే పాత గూటి మీద రాళ్లు వేసి మరీ వెళ్తుంటారు. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీకి హ్యాండిచ్చిన ఎమ్మెల్యేలు అందరూ ఇదే ఫాలో అయ్యారు.
నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి ఉన్నట్టుండి జెండా మార్చేశారు. ఇప్పుడు చంద్రబాబు మీదే అవాకులు చవాకులు పేలుతున్నారు. చంద్రబాబు నాయకత్వం ఇష్టంలేని ఈ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుండి గెలిచినా పదవులకు కూడ రాజీనామాలు చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. ఎందుకంటే అవి పదవులు. అవి లేకపోతే వాళ్లకు విలువలేదు కాబట్టి. ఎమ్మెల్యేలే కాకుండా ఉంటే వేళ్ళు కనీసం జగన్ వరకు వెళ్లగలిగేవారు కూడ కాదు. కానీ గంటా ఆ టైప్ కాదు. ఆయన పార్టీ నుండి వైదొలగాలి అనుకున్నప్పుడు ఆ పార్టీ అధినేతకు చెప్పే వెళ్ళిపోతారు. రాత్రికి రాత్రి నిర్ణయాలను తీసుకోరు. ఎందుకు పార్టీని వీడుతున్నది నాయకుడికి చెప్పి వారి నుండి అనుమతి తీసుకుని మరీ నిష్క్రమిస్తారు.
ఈసారి కూడ అదే చేశారు. ముందే టీడీపీకి పార్టీని వీడుతున్నట్టు సంకేతాలిచ్చారు. చంద్రబాబుకు కూడ ఈయన అన్నీ వివరంగా చెప్పి ఆయన్ను ఒప్పించారనే టాక్ కూడ ఉంది. కానీ వైసీపీలోని కొన్ని శక్తులు ఆయనకు అడ్డంపడ్డాయి. పార్టీలోకి వస్తే చెప్పినట్టు వినాలని కండిషన్ పెట్టారు కొందరు. అయితే గంటాకు అది నచ్చలేదు. అందుకే డేరింగ్ రూట్ ఎంచుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వివాదం కలిసిరావడంతో ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. మిగతా వారిలా ఉపఎన్నికలు వస్ట్ ఎగెలుస్తామా లేదా అని భయపడలేదు. ఉపనేనికల్లో పోటీచేయనని కూడ అంటున్నారు. జేఏసీని ఏర్పాటుచేసుకుని పోరాటానికి రెడీ అయ్యారు. ముఖ్యమంత్రికి సానుకూలంగా మాట్లాడుతున్నారు.
ఈ చర్యతో కేంద్రానికి వ్యతిరేకంగా రాజీనామా చేసిన మొదటి ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. జనంలో తిరుగుతున్న ఆయన రానున్న రోజుల్లో బలమైన యాక్షన్ ప్లాన్ వేసుకుని ముందుకు వెళ్లొచ్చు. జనంలో మరోసారి పాపులర్ అవ్వొచ్చు. ఇక ఎన్నికల నాటికి గంటా లాంటి మాస్ నాయకుడికి ఏ పార్టీ అయినా పిలిచి మరీ టికెట్ ఇస్తుంది. అది వైసీపీ కావొచ్చు టీడీపీ కావొచ్చు జనసేన కావొచ్చు. గంటా అయితే గెలిచే పార్టీలోకే వెళతారు. వెళ్తూ వెళ్తూ మంత్రి కన్ఫర్మ్ చేసుకుని మరీ వెళ్తారు.