బిగ్ పాయింట్ : గల్లా జయదేవ్ రాజీనామా చేయకుండా ఆగుతోంది అందుకే అన్నమాట ?

BJP Stands Clear With Ram Madhav Comments

రాజకీయాల్లో పార్టీలు మారడమనేది చాలా సహజమైన అంశం. ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఒక పార్టీలో చేరిన నాయకులు మళ్ళీ వేరే పార్టీలలో చేరుతారో ఎవ్వరికీ అర్ధం కాదు. పార్టీ సిద్ధాంతాలు మారుతాయో లేక పార్టీ మారే వ్యక్తి యొక్క సిద్ధాంతాలు మారుతాయో జనాలకు అర్ధం కాదు.

ఈరోజుల్లో రాజకీయాల్లో సిద్ధాంతాల గురించి మాట్లాడటం, నాయకులకు సిద్ధాంతాలు ఉండాలని అనుకోవడం ప్రజల యొక్క మూర్ఖత్వం . అవసరాలను బట్టి నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు. తమకు అవసరం ఉంటే వాళ్ళను గెలిపించిన ప్రజలను గంగలో వదిలేసి వేరే పార్టీలో చేరుతారు. ఇప్పుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా పార్టీ మారుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల రాష్ట్రంలో టీడీపీ నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేశ్ లను వైసీపీ దెబ్బతీసిందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన కంపెనీకి చిత్తూరు జిల్లాలో కేటాయించిన భూములను వెనక్కి తీసుకొని షాకిచ్చింది. కోర్టుకెళ్లి గల్లా జయదేవ్ స్టే తెచ్చుకున్నాడు. అయితే గల్లాను రాజకీయంగా ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు వైసీపీ కాచుకు కూర్చుందన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. ఇలా అధికార పార్టీ నుండి ఎదురవుతున్న ఇబ్బందుల నుండి బయటపడవేసే శక్తి చంద్రబాబుకు లేదని భావించిన జయదేవ్ బీజేపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారని రాష్ట్రంలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

వైసీపీ పెడుతున్న ఇబ్బందుల నుండి బయటపడాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెంతకు చేరడమే కరెక్టని భావించిన జయదేవ్ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వన్నందుకు బీజేపీని జయదేవ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు, అలాగే పార్లమెంట్ లో బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఇలా సడన్ గా తన అవసరం కోసం బీజేపీలో చేరితే ప్రజలు ఎలా స్పందిస్తారోననే భయంతోనే పార్టీ మరాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు .