ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు. అసలు ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.? అన్న ప్రశ్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతోంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం తొలుత విడిపోయింది. అంటే, ప్రస్తుతం మనం వ్యవహరిస్తున్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత, దాన్ని తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.. అదీ ఇదే రోజున.
అలా, నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా చాలా ఏళ్ళు జరుపుకున్నాం. మధ్యలో, తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రం (ఒకప్పటి 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్) నుంచి విడిపోయింది. పేరు పాతది, రాష్ట్రం కొత్తది.. ఇదీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ దుస్థితి.
13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఏడేళ్ళు దాటింది. ఇప్పటికీ, రాష్ట్రానికి రాజధాని ఏది.? అంటే, రాష్ట్ర ప్రజలు బిక్కమొహం వేయాల్సి వస్తోంది. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని. అందుకే, 13 జిల్లాల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలుని న్యాయ రాజధానిని చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. కానీ, అది వీలుపడని పరిస్థితులు ఏర్పడ్డాయి.
మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం మరోమారు మూడు ముక్కలయ్యే పరిస్థితి వుందన్న ఆందోళన అయితే ప్రజల్లో వుంది. రాయలసీమ నుంచి తరచూ విభజన వాదం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా అణగదొక్కబడుతోంది. అలాగని, మిగతా ప్రాంతాల్లో సమస్యలు లేవని కాదు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సమైక్య నినాదం సత్ఫలితానివ్వలేదు. పోనీ, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా, రాష్ట్ర సమస్యల పట్ల సమైక్యంగా అందరూ ముందడుగు వేస్తున్నారా.? అంటే అదీ లేదు. రాజకీయ రణ రంగం నడుమ, ఆంధ్రప్రదేశ్ ప్రతిసారీ ఓడిపోతోంది.. ఓడిపోతూనే వుంది.