కొన్ని సందర్భాలలో అగ్ని ప్రమాదాల వల్ల భారీ స్థాయిలో ఆస్తి నష్టమే కాకుండా ప్రాణా నష్టం కూడా వాటిల్లుతుంది. ముఖ్యంగా ఇటువంటి అగ్ని ప్రమాదాలు వేసవి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఇటీవల హాస్పిటల్స్ లో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల మధ్యప్రదేశ్ లో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో పాటు పలువురు మృతిచెందగా ..ఎక్కువ మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో సంభవించిన ఈ ప్రమాదంతో తీవ్ర విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ న్యూలైఫ్ ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో పాటు మరికొంతమంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య పదికి చేరుకుంది. అంతే కాకుండా భారీగా మంటలు చెలరేగటంతో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో మంటలు చెలరేగగానే అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మొదట ఏడు మంది మరణించినట్లు గుర్తించగా తర్వాత ఆ సంఖ్య పదికి చేరింది.
ఈ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు . హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వేరే హాస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాల గురించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆస్పత్రిలో భారీగా మంటలు చెలరేగటానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక ఇతర కారణాలవల్ల ఈ ప్రమాదం సంభవించిందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.