Crime News: అడవి పందుల దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన మహిళా రైతు..!

Crime News: మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఎండా ,వాన అని తేడా లేకుండా పొలంలో కష్టపడి మన అందరికీ తిండి పెట్టే రైతన్న కొన్ని అనుకోని సంఘటనల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. పొలం పనులు చేసే సమయంలో కరెంట్ షాక్ కొట్టడం, పాము కాటుకి గురికావటం అంటే వాటివల్ల ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో జరిగిన ఒక సంఘటన అందరినీ కలిచివేసింది.

వివరాలలోకి వెళితే.. మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం, ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పద్మ అనే ఒక మహిళా రైతు చేనులో ఒంటరిగా పత్తి తీస్తూ ఉండగా అడవి పందుల దాడి చేయడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆస్నాథ్ శివారులోని తన సొంత చేనులో పద్మ అని మహిళా రైతు ఒంటరిగా చేనులో పత్తి తీస్తూ ఉండగా అడవి పందుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. అడవి పందులు దాడి చేయడంతో పద్మావతి పొలంలోనే ప్రాణాలు విడిచింది.

పద్మావతి భర్త సూర్యనారాయణ రెడ్డి ఆమె తీసిన పత్తిని పొలం నుండి ఇంటికి తీసుకుని వెళ్ళటానికి ఎడ్లబండిపై పొలానికి చేరుకున్నాడు. అక్కడ తన భార్య గాయాలతో పడి ఉండటం చూసి ఒక్కసారిగా బాధతో రోదించాడు, వెంటనే సూర్యనారాయణ రెడ్డి ఈ సమాచారాన్ని పోలీసులకు, బంధుమిత్రులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు సూర్యనారాయణ రెడ్డి ని విచారించగా అడవి పందుల దాడి చేయడం వల్ల తన భార్య మరణించిందనీ సూర్యనారాయణ రెడ్డి పోలీసులకు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం పద్మావతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పొలం పనులు చేసే సమయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండద్దని పోలీసులు హెచ్చరించారు.