అమరావతిని కాదని మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించారు జగన్. విపక్షాలు ఎంతగా విమర్శిస్తున్నా, అమరావతి రైతులు ఏడాది తరబడి పోరాడుతున్నా జగన్ నిర్ణయంలో మార్పు రాలేదు. రాజధాని వికేంద్రీకరణ జరగాల్సిందే, విశాఖ, కర్నూలు జిల్లాలు కూడ రాజధానులుగా మారాల్సిందేనంటూ కంకణం కట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు అంతా ఆయన అనుకున్నట్టే జరిగింది. అడ్డుపడతారు, ఆపుతారు అనుకున్న కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టమని, తాము కలుగజేసుకోలేమని చేతులెత్తేశారు. దీంతో జగన్ పాలనా రాజధానిని విశాఖకు తరలించే ఏర్పాట్లు చేశారు.
కానీ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టుకు వెళ్లి అమరావతిని నిర్వీర్యం చేయడం అన్యాయమని పిటిషన్ వేయడంతో తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. లేకుంటే ఈపాటికే పాలనా విభాగాలన్నీ విశాఖలో కొలువుదీరేవి. కోర్టులో రైతుల తరపున న్యాయవాదులు, ప్రభుత్వం తరపున న్యాయవాదులు హోరాహోరీగా వాదించుకుంటున్నారు. లెక్కకు అందని లాజిక్స్ తీస్తూ కేసులో పైచేయి సాధిచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రైతుల తరపు సీనియర్ అడ్వకేట్ శ్యామ్ దివాన్ మంగళవారం వినిపించిన వాదనలు చాలా బలంగా అనిపించాయి.
రాజధాని మార్పు వలన రాష్ట్రం మీద భారీగా ఆర్ధిక భారం పడుతుందన్న ఆయన విభజన సమయంలో రాజధానిగా ఎంపికచేసిన ప్రాంతాన్ని మార్చే హక్కు ప్రభుత్వానికి లేదని, ఒక ప్రాంతాన్ని రాజధానిగా ఒప్పుకుని కేంద్రం ఆ ప్రాంతం మీద భారీగా నిధులు ఖర్చుపెడితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రాజధాని కాదనడం సమంజసం కాదని, అది సహకార సమాఖ్యవాద స్ఫూర్తికి విఘాతం, కలిగించడమేనని ఇది మంచి పద్దతి కాదని, జీవనోపాధి అయిన భూములను రాజధాని కోసం ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుందని, 33 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు.
ఇక్కడ ఆయన లేవనెత్తిన కేంద్రం వెచ్చించిన నిధులు వృథా కావడం అనే అంశాన్ని కోర్టు సమర్థించకపోవచ్చని, కేంద్రమే సహాయం చేసింది కాబట్టి దానితో వచ్చిన సమస్య ఏమిటని, అలాచేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించినట్టు కాదా అనే ప్రశ్నలు ధర్మాసనం నుండి ప్రభుత్వానికి ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.