ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుందని వైఎస్ జగన్ ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఎవరూ ఆపలేరని వైసీపీ నేతలు పదే పదే చెబుతుండడం వింటున్నాం. అసలు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవడం సాధ్యమేనా.? విశాఖ కొలువు దీరిన ఉత్తరాంధ్ర ప్రజలు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు.? ఏ ప్రాంత ప్రజలైనా తమ ప్రాంతానికి రాజధాని వస్తే కాదంటారా.? ఛాన్సే లేదు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరాలని ఉత్తరాంధ్రవాసులు కోరుకుంటున్నారు. విశాఖనగరంలో ఈ కోరిక మరింత బలంగా వుంది. అయితే, వారిలో రాజధాని భయాలూ లేకపోలేదు. ఎందుకంటే, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, దేశంలో అందరికీ, ‘రాజధాని భయం’ అమరావతితోనే కలిగింది. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నడిపిన పబ్లిసిటీ స్టంట్లు అలాంటివి.
విదేశాలకు వెళ్ళొచ్చారు.. సినిమా దర్శకుడి సలహాలు విన్నారు.. ఏవేవో వ్యవహారాలు నడిపారు.. చివరికి అమరావతిలో శాశ్వత నిర్మాణం.. పేరుతో ఒక్క భారీ నిర్మాణాన్నీ పూర్తి చేయలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో, ఏ ప్రభుత్వమైనా రాజధాని ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మించగలదా.? అన్న అనుమానాలు ప్రజల్లో బలపడిపోయాయి. రెండేళ్ళుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ఏమీ చేయలేకపోయింది. దాంతో, ఒకవేళ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినా, ‘రాజధాని’ అనే బోర్డు తప్ప, విశాఖకు ఏదీ అదనంగా ఒరగదు.. అన్న భావన అక్కడి ప్రజల్లో వుండడంలో వింతేమీ లేదు. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం, న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోతే.. విశాఖ అభివృద్ధిని శరవేగంగా చేపడతామని అంటోంది. అంత సమయం వైఎస్ జగన్ ప్రభుత్వం దగ్గర వుంటుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.