ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. ఆ ప్రాణాన్ని పరీక్షల కోసం పణంగా పెట్టాల్సి రావడమంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఇదే విషయాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకున్నాయి. పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశాయి.
ఇంటర్మీడియట్ పరీక్షల్ని వాయిదా వేయడమో, రద్దు చేయడమో చేశాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మాత్రం పరీక్షల రద్దు విషయమై గందరగోళం కొనసాగుతోంది. ఒకానొక దశలో ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరించిందిగానీ, కోర్టు జోక్యంతో.. పరీక్షల వాయిదా తప్పలేదు. రోజులు గడిచిపోతున్నాయ్.. నెలలు గడిచిపోతున్నాయ్.. ఇంకా ఎక్కువకాలం వాయిదా వేయడం వల్ల సమస్య పెరుగుతుందే తప్ప తగ్గదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయడమే ఉత్తమం. ఇప్పటికే విద్యార్థులు పరీక్షల విషయమై తీవ్ర మానసిక ఒత్తిడిలో వున్నారు. విపక్షాలు విమర్శిస్తుండడం వల్ల ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరిస్తోందన్న ప్రచారమే నిజమైతే, అది ప్రభుత్వానికి ఏమాత్రం మంచి పేరు తీసుకురాదు.. పైగా, ప్రభుత్వానికి అదో మచ్చలా మిగిలిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమే.. అంతకన్నా ముఖ్యం వారి ప్రాణాలు. ఉన్నత విద్యకంటే, మానసిక వికాసం చాలా ముఖ్యం.
మానసిక ఆందోళనతో విద్యార్థులు పరీక్షలు రాసినా ఏం లాభం.? నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం (సీబీఎస్ఈ) పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాక చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, దేశంలోని పలు రాష్ట్రాలు ఇంటర్ పరీక్షల రద్దు విషయమై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రపదేశ్ ఈ విషయమై ఇంకా ‘తెగేదాకా లాగే ధోరణి’ అనుసరించడం సబబు కాదు.