తెలంగాణ ముఖ్యమంత్రికి మాస్టర్ స్ట్రోక్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి మాస్టర్ స్ట్రోక్ లాంటిదే ఇది. తెలంగాణలో బహుజన స్థాపన వస్తే, ఎవరూ ఆపలేరంటూ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుజనులు ఎక్కడ వున్నారో అక్కడే వుండాలనేది పాలకుల ఆలోచన.. అంటూ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌లో మాత్రమే ఎందుకు తెరపైకి తెస్తున్నారంటూ తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రశ్నించారు. ‘ఎవరికో గుణపాఠం చెప్పేందుకు వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు..’ అంటూ ఈటెల విషయంలో సీఎం కేసీయార్, చేస్తున్న ‘అతి’పై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు.

వెయ్యి కోట్లతో పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లు కొనివ్వొచ్చనీ.. వాటితోపాటు, అత్యద్భుతమైన హాస్టళ్ళను నిర్మించవచ్చనీ, 20 వేల డిజిటల్ పాఠశాలలు ఏర్పాటు చేయవచ్చుననీ ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇటీవల ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం విదితమే. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ప్రవీణ్ కుమార్, రాజకీయాల్లోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో సొంత రాజకీయ వేదిక కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ విభాగాన్ని ఆయన లీడ్ చేసే అవకాశం వుందన్న ప్రచారమూ లేకపోలేదు. మొదట్లో, సీఎం కేసీయార్ ఆదేశాలతోనే ప్రవీణ్ కుమార్, స్వచ్ఛంద పదవీ విరమణ చేశారనీ, ఈటెల రాజేందర్‌పై ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేస్తారనీ గుసగుసలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా కేసీయార్ మీద మాటల దాడి షురూ చేశారాయన.