తెలంగాణ ఓట్ల పండక్కి చదివింపులు షురూ.! కానీ, ఏ స్థాయిలో.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు ఇచ్చే కరెన్సీ నోటు గురించిన చర్చ సర్వత్రా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఓ రోజు ఆయా పార్టీల వెంట తిరిగేందుకోసం ‘కూలీ’ లెక్కలే, అభ్యర్థులకు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.

ఒక్కో ‘కార్యకర్తకీ’ సగటున, రోజుకి రెండు వేల నోటు చిరిగిపోతోంది. కొన్నిసార్లు, రెండు ‘రెండు వేల నోట్లు’ కూడా చిరిగిపోతున్నాయ్.! ఖర్చులు అంతలా పెరిగిపోయాయ్ మరి. బిర్యానీ పెట్టాలి.. లిక్కర్ పొయ్యాలి.. ఆపై కరెన్సీ నోటు కొట్టాలి. లేకపోతే, ‘కార్యకర్త’ ఏ అభ్యర్థి వెంటా కనిపించే ఛాన్సే లేదు.

ఇక, పండక్కి.. అంటే, పోలింగ్ రోజున ముచ్చట వేరు. ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయాల్సి వుంటుంది. చివరి నిమిషంలో పంచే పంపకాలే పోలింగ్ బూత్‌ల వద్ద అభ్యర్థుల జాతకాల్ని తేల్చుతాయన్నది నిస్టుర సత్యం.

‘అబ్బే, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం.. డబ్బు పంపకాలకు ఆస్కారమే లేదు’ అని ఏ ప్రభుత్వ శాఖ అయినా చెప్పదలచుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అన్నట్టు, పంపకాలు అప్పుడే మొదలైపోయాయంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కథనాలు వస్తున్నాయి.

‘ఓటుకి రెండు వేల నుంచి మూడు వేల వరకూ పంచుతున్నారట కదా..’ అంటూ మీడియాలో వస్తున్న కథనాల గురించి చర్చించుకుంటున్న జనం, ఆ ‘రెండు లేదా మూడు వేలు దేనికి పనికొస్తాయ్.?’ అని సెటైర్లేసుకుంటున్నారు.

తక్కువలో తక్కువ 5 వేల నుంచి పది వేల వరకూ ఇస్తేనే.. అనేవారూ లేకపోలేదు. ‘ఏం మునుగోడులో ఇవ్వలేదా.? హుజూరాబాద్‌లో ఖర్చు చేయలేదా.?’ అంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో, ఓట్ల పండక్కిచ్చే కానుకల గురించి మాట్లాడుకుంటున్నారు. దాంతో, రాజకీయ పార్టీలు తలపట్టుక్కూర్చోవాల్సి వస్తోంది.