ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా ఏంటి? సరి సరి లే అని ముందుకు పోవడం తప్ప! చేసేదేముంటుంది. అదీ రాజకీయాలలో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. వాటిని తట్టుకుని నిలబడే గుండె నిబ్భరం కావాలి. ఆ విషయంలో వైసీపీ నాయకుడు మర్రి రాజశేఖర్ కు కావాల్సినంత నిబ్భరం ఉన్నట్లే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మంత్రి పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్కి ఆశాభంగం తప్పడం లేదు. 2014 నుంచి 2019 వరకూ రాజశేఖర్ ఇలాగే దెబ్బ తింటున్నారు.
2014 పుల్లారావు అవకాశాన్ని ఎగరేసుకుపోగా, 2019 లో విడదల రజని కారణంగా రేసులో వెనుకబడాల్సి వచ్చింది. అలాగని ఆయన పార్టీపైనా, జగన్ పైనా నమ్మకం కోల్పోలేదు. ఆయన సీఎం అయితే రూలింగ్ మనదేనని భావించి నేటికి పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తప్పక తన సేవల్ని ఏదో రూపంలో వాడుకుంటారని రాజకీయ వర్గాల్లో సైతం చర్చకొచ్చింది. కానీ వాళ్లను కూడా తలదన్నేలా ఊహించని నిర్ణయాలతో జగన్ …రాజశేఖర్ కు షాక్ ల మీద షాకులు ఇస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీగానైనా ఎంపిక చేసి మంత్రి చేస్తారనుకుంటే అదీ కూడా జరగలేదు. గవర్నర్ కోటా లో ఉన్న రెండు సీట్లు జకియా, పండుల రవీంద్ర ఎగరేసుకుపోయారు.
ఆపై ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైనా మోపీదేవి వెంకటరమణ పాత ఎమ్మెల్సీ సీటులోనైనా కూర్చొబెడతారని ఆశించారు. అది కూడా పనవ్వలేదు. మోపీదేవి స్థానంలో విజయనగరం జిల్లా కు చెందిన పెన్మత్స తనయుడు సురేష్ ని ఎంపిక చేసారు. ఈ నెల 13 న ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేయనున్నారు. ఈ సీటుపై మర్రి చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశాభంగం తప్పలేదు.