హరీష్ రావుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈటెల రాజేందర్

‘నీ గుట్టు నాకు తెలుసు.. నా విషయాలు నీకు తెలుసు..’ అంటూ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీష్ రావుని హెచ్చరిస్తూ. ‘నీ గురించి నేను మాట్లాడటం మొదలు పెడితే బావుండదు. నేను వేయించిన రోడ్ల మీదనే నువ్వు తిరుగుతూ నన్ను విమర్శిస్తున్నావ్..’ అని ఈటెల ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో హరీష్ రావుని రంగంలోకి దించారు గులాబీ బాస్ కేసీయార్, తమ పార్టీ ప్రచారం కోసం. ఈ క్రమంలో ఈటెలపై విరుచుకుపడ్డారు హరీష్. హరీష్ తనను విమర్శించడంపై ఈటెల గుస్సా అయ్యారు. 2014 వరకూ ఉద్యమంలో అందరం కలిసి పనిచేశాం. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయింది. ప్రజలకు మేలు చేయాల్సిన పాలకులు, కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపారు.. అంటూ ఈటెల వ్యాఖ్యానించారు. రైతు బంధు కార్యక్రమం డబ్బున్నోళ్ళకి ఎందుకు.? అని ఈటెల మరోమారు ప్రశ్నించారు.

‘ఉద్యమ పార్టీలో వలసదారులే ఎక్కువమంది వున్నారు.. వారిదే ఆధిపత్యం. స్వేచ్ఛగా ప్రభుత్వంలో పనిచేసే అవకాశం నా లాంటివాళ్ళకు దక్కలేదు. హరీష్ రావు కూడా బాధితుడే.. అతన్ని నా మీదకు కేసీయార్ ఉసిగొల్పారు..’ అంటూ ఈటెల రాజేందర్ ఆరోపించడం గమనార్హం. ఇంతకీ, హరీష్ రావుకి సంబంధించిన ఏ ‘గుట్టు’ ఈటెల రాజేందర్ దగ్గర వుందట.? ఈ విషయమై వివాదం మరింత ముదురుతుందా.? ఈటెల రాజేందర్ గుట్టుని హరీష్ బయటపెడితే, హరీష్ గుట్టుని ఈటెల బయటపెట్టడం ఖాయమేనా.? లేదంటే, ఈటెల హెచ్చరికతో, హరీష్ రావు సైలెంటయిపోతారా.? అయినా, ఈటెల విషయంలో హరీష్ రావుని కేసీయార్ బలిపశువుగా ఎందుకు మార్చేస్తున్నట్టు.? ఏమో, ముందు ముందు ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందేమో.