ఇదేం స్పీడ్ బాబోయ్: ఈటెల రాజీనామాకి ఆమోదం.!

Etela's Resignation Accepted

Etela's Resignation Accepted

మాజీ మంత్రి ఈటెల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి కూడా ఈ రోజు రాజీనామా చేసేశారు. ఇలా ఆయన తన రాజీనామా లేఖని అసెంబ్లీ కార్యదర్శికి పంపారో లేదో, అలా ఆయన రాజీనామాకి ఆమోదం లభించింది. అంతేనా, ఈటెల రాజీనామా నేపథ్యంలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు కూడా ప్రకటన వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, తెలంగాణలో చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపులు అన్నీ ఇన్నీ కావు. ఫిరాయింపులపై చర్యలు తీసుకోండంటూ టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేసిన గోల అంతా ఇంతా కాదు. ఈ మూడే ప్రధానంగా బాధిత పార్టీలు తెలంగాణలో. టీడీపీ నిన్న మొన్నటిదాకా కూడా కొట్లాడింది.

కాంగ్రెస్ పార్టీ ఇంకా కొట్లాడుతూనే వుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలు మంత్రులయ్యారు కూడా. అయినాగానీ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడలేదు. ఆంధ్రపదేశ్ రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి. చంద్రబాబు తన హయాంలో ఎలాంటి ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడ్డారో, అంతకు తగ్గకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. రాజకీయాల్లో ఫిరాయింపు.. అనేది రాజకీయ నాయకుల జన్మహక్కులా తయారైందిప్పుడు. ఇలాంటి తరుణంలో ఈటెల రాజేందర్ మాత్రం ధైర్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

నిజానికి, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యకుండా కూడా బీజేపీలోనో మరో పార్టీలోనో చేరాలనుకుంటే చేరొచ్చు. కానీ, ఆయన నైతిక విలువలకు కట్టుబడ్డారు. ఈ విషయంలో మాత్రం ఈటెల రాజేందర్‌ని ‘ఆడు మగాడ్రా బుజ్జీ..’ అనాల్సిందేనంటూ సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా నినాదాలు పోటెత్తుతున్నాయి. కాగా, నేటినుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందడి షురూ అయినట్లు కనిపిస్తోంది. ఈటెల మద్దతుదారులు, ఎన్నికల ప్రచారం షురూ చేసేశారు. ఈటెల ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే.