మాజీ మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వానికి ఎదురెళుతున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని సవాల్ చేస్తున్నారు.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై కయ్యానికి కాలు దువ్వుతున్నారు. సొంత పార్టీ మీదనే, రాజకీయ గురువు మీదనే, తాను మంత్రిగా పనిచేసిన ప్రభుత్వం మీదనే పోరాటానికి ‘సై’ అనేస్తున్నారు. ఈటెల రాజేందర్ ఇంత ధైర్యంతో ముందడుగు వేయడానికి కారణమేంటి.? అసలు ఈటెల రాజేందర్ నిజంగానే అంత బలవంతుడా.? అన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిని.. అదునా కేసీఆర్ లాంటి వ్యక్తిని సవాల్ చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
రేపో మాపో ఈటెల రాజేందర్ అరెస్టవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వం తన విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనీ, కేసీఆర్ తన మీద పగబట్టేశరనీ ఈటెల రాజేందర్ చెబుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే బలప్రదర్శనకు సైతం ఈటెల రాజేందర్ వెనకడుగు వేయలేదు. ‘నేను ఎవరికీ భయపడను.. ప్రేమకు లొంగుతానేమో.. అణచివేతకు లొంగను..’ అంటూ ఈటెల చెబుతున్న మాటలు, అధికార పార్టీకి ఈటెల్లానే గుచ్చుకుంటున్నాయి. ప్రభుత్వ పెద్దలంటే అధికార పార్టీ నేతలే కదా.
ఈ నేపథ్యంలో ఈటెల గత చరిత్ర మొత్తాన్నీ తవ్వే పనిలో వుంది తెలంగాణ ప్రభుత్వం. అష్ట దిగ్బంధనం అనే స్థాయిలో ఈటెలను ఇరికించేస్తే, రాజకీయంగా ఈటెల రాజేందర్ చరిత్ర భూస్థాపితమైపోతుందన్నది అధికార పార్టీ ఆలోచనలా కనిపిస్తోంది. మరీ ఇంతలా అణచివేత ధోరణా.? బలహీన వర్గాలకి చెందిన నాయకుడ్ని ఇంతలా అణగదొక్కాలా.? అందునా, ఈటెల రాజేందర్ లాంటి వివాద రహితుడి మీద బ్రహ్మాస్త్రమా.? కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నారో ఏమో.. ఈటెల ఎంత చేయకూడని పని చేశారో ఏమో.!