జేపీ నడ్డా దగ్గర ఈటెల, కేసీఆర్ ప్రస్తావన ఎందుకు చేసినట్టో.?

Etela With JP Nadda, Only Doubt On KCR
Etela With JP Nadda, Only Doubt On KCR
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎలాగైతే రాజకీయంగా ఎదిగామో, అలాంటి వ్యూహంతోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ అంటోంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సెలవిచ్చారట. అలా ఆయన సెలవివ్వడానికి ఈటెల వ్యక్తం చేసిన అనుమానాలే కారణమట. బీజేపీ – టీఆర్ఎస్ కలిసిపోతే తన పరిస్థితి ఏంటి.? అన్న విషయాన్ని ఈటెల, జేపీ నడ్డా ముందు ప్రస్తావించారట. దాంతో, ఒకింత షాక్ తినేసిన జేపీ నడ్డా, వెంటనే తేరుకుని.. పశ్చిమబెంగాల్ అంశాన్ని తెలంగాణతో పోల్చారని అంటున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ చాలా విమర్శలు చేస్తోంది.. తెలంగాణ ప్రభుత్వంపైనా మండిపడుతోంది.. కానీ, కేంద్రంలో అధికారం తమ చేతుల్లో వున్నా, బీజేపీ.. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదన్నది ఈటెల ఆవేదనగా కనిపిస్తోంది. నిజానికి, ఈ విషయాన్ని జేపీ నడ్డా వద్ద ప్రస్తావించడంలోనే ఈటెల తెగువ ఏంటో తేటతెల్లమైపోయింది. కానీ, ఈ సమయంలో ఇది అవసరమా.? అన్నదే అసలు సిసలు ప్రశ్న. ఢిల్లీకి ఈటెల వెళ్ళింది, తనకున్న అనుమానాలన్నిటినీ క్లియర్ చేసుకోవడానికే. ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఎంతలా అత్యుత్సాహం ప్రదర్శించినా, ఢిల్లీ స్థాయిలో బీజేపీకి మాత్రం ప్రత్యేకమైన వ్యూహాలున్నాయి. వాటి ప్రకారమే అన్నీ నడుస్తాయి. ఏపీ రాజకీయాల్లో కూడా ఇదే జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తమకు సహకరిస్తే, బీజేపీకి ఇబ్బంది ఏమీ వుండదు.. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీల్ని నిర్వీర్యం చేసే విషయమై సమయానుకూలం కీలక నిర్ణయాలు తీసుకుంటుంటుంది బీజేపీ. పరిస్థితులు అనుకూలించకపోతే, ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కూడా బీజేపీకి అలవాటే. బహుశా అదే ఈటెల ఆందోళనగా కనిపిస్తోంది.