గులాబీ పార్టీలో ఈటెల పంచాయితీ సద్దుమణిగిందా.? లేదా.?

Etela Storm In TRS Weakens finally!

Etela Storm In TRS Weakens finally!

తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నారట.. తెలంగాణ రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పేందుకు ఆయన ముందస్తు ఏర్పాట్లు చేసేసుకుంటున్నారట.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయమై గుస్సా అవుతున్నారట. ఈటెలపై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేకంగా నిఘా పెట్టిందట. ప్రస్తుతానికి ఇవన్నీ ‘అట’లు మాత్రమే.

పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడంలేదనో.. ప్రభుత్వంలో తనకు సరైన గౌరవం దక్కడంలేదనో.. ఈటెల ఒకింత ‘కినుక’ వహిస్తున్న మాట వాస్తవం. వీలు చిక్కినప్పుడల్లా ఈటెల రాజేందర్ తూటాల్లాంటి మాటలు పేల్చుతున్నారు. ఆయన ఉద్యమ నేత. ‘మేం కిరాయిదార్లం కాదు.. మేం గులాబా పార్టీ ఓనర్లం..’ అని ఓ సందర్భంలో ఈటెల చేసిన వ్యాఖ్యలతో దుమారం మొదలైంది. అప్పటినుంచి, వీలు చిక్కితే చాలు.. ప్రత్యర్థులకు ఈటెల కౌంటర్లు ఇస్తున్నారు. ఆ ప్రత్యర్థులు సొంత పార్టీకి చెందిన నేతలే కావడం గమనార్హం. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. స్వయంగా ఈటెలతో సంప్రదింపులు జరుపుతున్నారు.. బుజ్జగిస్తున్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకీ తీసుకెళ్ళారు తాజాగా. ‘ఇక్కడితో వివాదం ముగిసినట్లే..’ అని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఈటెల అంటే ఫైర్ బ్రాండ్.. మరీ ఆవేశానికి గురికాకపోయినా, ఆయన తనకంటూ వున్న ప్రత్యేకమైన పాపులారిటీ, తెగువతో అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటారు.

కొత్త పార్టీ దిశగా ఈటెల ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం వుంటుందని అనుకోలేం. కానీ, ఇతర పార్టీల నుంచి ఖచ్చితంగా ఆయనకు మంచి ఆఫర్లే వుంటాయి. బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ఆయనకు గాలం వేస్తున్నాయి. కొత్తగా షర్మిల పార్టీ నుంచి కూడా ఈటెలకు ఆహ్వానం వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు. అయితే, ఇదంతా గులాబీ పార్టీలోనే వున్న కొందరు చేస్తున్న దుష్ప్రచారమని ఈటెల సన్నిహిుతులు చెబుతున్నారట.