ఇప్పుడొస్తుంది అసలు సిసలు మజా.. అనుకోవాలా.? కేసీఆర్ నేర్పిన బాటలో కేసీఆర్ మీదనే రాజకీయ పోరాటం చేస్తానంటోన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి.? మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేయడం పట్ల ఈటెల రాజేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాణానికి రెండు వైపులు.. ఒకటి కారుణ్యం, ఇంకోటా కాఠిన్యం.. ఇప్పుడు కాఠిన్యాన్ని చూస్తున్నా.. అలాంటిది వుంటుందని నేనెప్పుడూ కేసీఆర్ విషయంలో అనుకోలేదంటూ ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో వాపోయారు. పదవుల కోసం తానెప్పుడూ పాకులాడలేదన్న ఈటెల రాజేందర్, కేసీఆర్ కోసం గతంలో కంచుకోటలా నిలబడినట్లు చెప్పుకున్నారు. అలాంటి తన మీద నిందలు మోపడం, తన వ్యక్తిత్వాన్ని చంపే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం బాధాకరమన్నారు.
తనను ఇన్నేళ్ళుగా ఆదరిస్తోన్న హుజూరాబాద్ ప్రజలతో సంప్రదించి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయమై నిర్ణయం తీసుకుంటానని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించడం గమనార్హం. సిట్టింగ్ జడ్జితో కాకుండా, ప్రభుత్వ అధికారులతో విచారణ చేయిస్తే, ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగానే రిపోర్టులు వస్తాయనీ, రైతుల్ని, సామాన్యుల్ని బెదిరించి.. తనకు వ్యతిరేకంగా ప్రకటనలు రప్పించారని ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యాననీ, తెలంగాణలో ఆ చివరి నుంచీ ఈ చివరి వరకూ ప్రజలందరికీ ఈటెల రాజేందర్ తెలుసనీ, వారందరి మద్దతుతో భవిష్యత్ రాజకీయ కార్యాచరణ రూపొందిస్తానన్నారు.
కరోనా నేపథ్యంలో అభిమానులెవరూ ఆందోళన చెందవద్దనీ, తన కోసం ఆందోళనలు, నిరసనలు తెలపొద్దనీ, తన మీద అభిమానం వుంటే, ఆ అభిమానాన్ని మీడియా ముందు తెలపాలనీ, తనకు మెసేజ్ పంపాలనీ ఈటెల రాజేందర్ కోరారు. ఈటెల మాటల్లో ఆంతర్యమేంటి.? న్యాయపోరాటం చేస్తననడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ఏమో, కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.