మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో తెలంగాణ సర్కారుకి న్యాయస్థానాల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయా.? అంటే, ఔననే చెప్పాలేమో. ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులకు చెందిన జమున హేచరీస్ అనే సంస్థ, భూ కబ్జాలకు పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణలతోనే, ఈటెలను మంత్రి వర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించారు. భూముల్లో సర్వే జరగడం, అక్రమాలని తేరడం, ఆ తర్వాత ఈటెలపై వేటు వేయడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఈటెల కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో, ఎవరో ఫిర్యాదు చేస్తే, రాత్రికి రాత్రి సర్వేలు చేసేసి, నిజాలు నిగ్గు తేల్చేయడమా.? అది సాధ్యమయ్యే పనేనా.? అంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది విచారణ సందర్భంగా. తొందరపాటు చర్యలపై ఆక్షేపణ వ్యక్తం చేసింది కూడా. తాజాగా, దేవయరయాంజల్ భూముల విషయంలోనూ ఈటెలను టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దూకుడుతనం ప్రదర్శించింది. ఇక్కడా తెలంగాణ సర్కారుకి హైకోర్టులో షాక్ తగిలింది. కూల్చివేతల వరకూ వెళ్ళొద్దని ఆదేశించింది. పాత వివాదంపై ఇప్పుడెందుకు అత్యుత్సాహమని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కరోనా నేపథ్యంలో అధికారులు, పూర్తిగా కరోనాపై ఫోకస్ పెట్టాల్సిన ఆవశ్యకతను తెలంగాణ హైకోర్టు గుర్తు చేసింది.
ఇలా తన విషయంలో ప్రభుత్వ అత్యుత్సాహానికి పదే పదే న్యాయస్థానాలు షాకిస్తుండడంతో ఈటెల ఖుషీఖుషీగా వుండే వుంటారు. ఈటెల సంగతేమోగానీ, ఈటెల మద్దతుదారులు మాత్రం, తాజా పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈటెలకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్స్ పెడుతున్నారు. మరోపక్క, తెలంగాణ ప్రభుత్వంపైనా, అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపైనా దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ఈటెల రాజేందర్.. అత్యంత వ్యూహాత్మకంగా భవిష్యత్ రాజకీయం గురించి సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, ఈటెల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ‘నిజం నిలకడ మీద తెలుస్తుంది.. నేను తప్పు చేయలేదు.. నన్ను బదనాం చేసే క్రమంలో తెలంగాణ ప్రభుత్వమే అభాసుపాలవుతోంది..’ అంటూ ఈటెల తనను కలుస్తున్న ఆయా నేతల వద్ద చెబుతున్నారట.