ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి ఈసారి ఓ దేశ ప్రధాని ప్రాణాలని బలితీసుకుంది. ఆఫ్రికా దేశమైన ఎస్వాటీనీ ప్రధాని ఆంబ్రోస్ మాడ్వులో లామిని కరోనాతో మృతి చెందారు. దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో నిన్న ఆయన తుది శ్వాస విడిచినట్టు ప్రభుత్వం ప్రకటించింది.తాను కరోనా బారినపడినట్టు నవంబరు మధ్యలో ఆంబ్రోస్ వెల్లడించారు.
అయితే, తనలో ఎటువంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నానని అప్పట్లో తెలిపారు.
డిసెంబరు 1న ఆయన పొరుగునే ఉన్న దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆంబ్రోస్ పరిస్థితి విషమించడంతో గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆ దేశ ఉప ప్రధాని థెంబా మసుకు అధికారికంగా ప్రకటించారు.
వ్యాపారవేత్త అయిన లామిని బ్యాంకింగ్ రంగంలో 18 ఏళ్లపాటు సేవలు అందించారు. అనంతరం అక్టోబరు 2018లో ప్రధానిగా నియమితులయ్యారు.
1986 నుంచి అధికారంలో ఉన్న రాజు ప్రధాని, మంత్రులను నియమిస్తారు. పార్లమెంటుపై ఆయనకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ఎస్వాటీనీ దేశ జనాభా దాదాపు 12 లక్షలు కాగా, ఇప్పటి వరకు 6,768 కరోనా కేసులు నమోదయ్యాయి. 127 మంది ప్రాణాలు కోల్పోయారు.