‘కుప్ప’కూలిన టీడీపీ: డ్యామేజీ కంట్రోల్ ఇక సాధ్యం కాదు.!

చెప్పే మాటలకీ, చేతలకీ అస్సలు పొంతన వుండదు. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నో సంక్షోభాలు చవిచూసిందిగానీ, ఈసారి కోలుకునే అవకాశమే లేదు. నిజానికి, 2014 ఎన్నికల నాటికే టీడీపీ పరిస్థితి పూర్తిగా మటాష్ అయిపోయింది. కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన కాస్తా టీడీపీకి ఊపిరినిచ్చింది. ఏం లాభం.? ఎక్కువ సమయం అవసరం లేకుండానే టీడీపీని పూర్తిగా చంద్రబాబు పడుకోబెట్టేశారు 2019 ఎన్నికల నాటికి.

2019 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా టీడీపీ పరిస్థితి మరింత అద్వాన్నంగా తయారైంది. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ మరింతగా దెబ్బతినేసింది. ఇకపై కోలుకోవడం అసాధ్యం. సరే, రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమేననుకోండి.. అది వేరే సంగతి. కానీ, టీడీపీ మళ్ళీ కోలుకుంటుందా.? కోలుకునే దిశగా చంద్రబాబు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా.? అబ్బే, ఛాన్సే ఇవ్వడంలేదు చంద్రబాబు టీడీపీ కోలుకోవడానికి.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కొన్ని ఎన్నికల్ని బహిష్కరించిన ఘనుడు చంద్రబాబు. ఇటీవల బద్వేలు ఉప ఎన్నిక జరిగితే అక్కడా టీడీపీ పోటీ చేయకుండా వుండిపోయింది. ఇవన్నీ టీడీపీ తరఫున జరిగిన చారిత్రక తప్పిదాలే.

రాజకీయ పార్టీ అన్నాక పోరాటం చేయాలి. చంద్రబాబు సారధ్యంలో పోరాటం చేయడాన్ని టీడీపీ ఎప్పుడో మర్చిపోయింది. ప్రతిసారీ, ఆరాటం.. అక్కసు.. వీటితోనే నెట్టుకొచ్చేస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. అదే టీడీపీకి శాపంగా మారిపోతోంది.

చంద్రబాబుకి తోడు లోకేష్ మరింతగా టీడీపీని దెబ్బతీస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి.. సంయమనం కోల్పోతున్నారు.. అదుపు తప్పిన మాటలతో టీడీపీ పరిస్థితిని మరింత దిగజార్చేస్తున్నారు. ఇకపై ఏ విశ్వాసంతో టీడీపీలో ఎవరైనా నాయకులుగా కొనసాగుతారు.?

సీనియర్ నాయకులు పార్టీలో ఇమడలేని పరిస్థితి.. కొత్త నాయకత్వం తయారవని పరిస్థితి. ఓ పార్టీ స్వీయ వినాశనానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?