ఈనాడు ‘పచ్చ’ కోత.! ఇది వేరే లెవల్.! టీడీపీ కోసమేనా ఇదంతా.?

తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాగా చెప్పబడే ‘గ్రూపు’లో ఈనాడు అతి ముఖ్యమైనదన్నదది ఓపెన్ సీక్రెట్. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుని టీడీపీ రాజగురువుగా భావిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఈనాడు జోరు పెంచింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే వుండడంతో, ఈనాడులో వైసీపీ వ్యతిరేక కథనాలు అనూహ్యంగా పుంజుకున్నాయ్.

అంటే, నిన్న మొన్నటిదాకా ఈనాడులో అసలు వైసీపీ వ్యతిరేక కథనాలు రాలేదని కాదు. వచ్చాయ్, అందుకే ‘దుష్ట చతుష్టయం’ అంటూ పదే పదే వైఎస్ జగన్ విమర్శిస్తున్నారు కూడా. ఈ ‘దుష్టచతుష్టయం’ ఆరోపణల మీద ఈనాడు మరింతగా గుస్సా అవుతున్నట్లుంది. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారు.? అసలు వాస్తవం ఏంటి.? అంటూ ప్రత్యక కథనాల్ని ‘ఈనాడు’ వండి వడ్డిస్తోంది.

రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. ప్రభుత్వంలో వున్నాసరే, రాజకీయ పార్టీలు రాజకీయమే చేయాలి. లేకపోతే, అసలంటూ రాజకీయ పార్టీలకు మనుగడ వుండదు. చెప్పిందొకటి, చేసేది ఇంకోటి.! ఎవరు అధికారంలో వున్నా అంతే. కేంద్రం మెడలు వంచేస్తామన్నారు.. రాజకీయంగా బీజేపీ ముందర మెడలు వంచేసుకుంది వైసీపీ అధినాయకత్వం. ఇది బహిరంగ రహస్యం.

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అదనపు ఆర్థిక సాయం కోసం.. కేంద్రం ముందు వైసీపీ సర్కారు సాగిలాపడక తప్పడంలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది కూడా అదే. వున్నంతలో, రాజకీయంగా తమ ఉనికి చాటుకోవడానికి వైసీపీ, సంక్షేమ పథకాల్ని ఆశ్రయిస్తోంది. ఇక మూడు రాజధానుల అంశమంటారా.? అందులో వైసీపీ, అనవసరపు మొండిపట్టుదలకు పోతోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి వైసీపీది. ఇదంతా బహిరంగ రహస్యమే.

దీన్నే ఈనాడు ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అమరావతి విషయంలో వైఎస్ జగన్ ఏం చెప్పారు, అసలు వాస్తవమేంటి.? అంటూ సవివరంగా ఇటీవల పేర్కొన్న ఈనాడు, తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయమై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ చేసింది. ఈనాడులో అన్నీ వాస్తవాలే వున్నాయనుకున్నా, వాటిని నమ్మేదెవరు.? వాస్తవాలు ఇప్పుడెవరికీ అక్కర్లేదు.

ఎలా చూసినా, ఈనాడుది ‘పచ్చ’ ఏడుపేనని జనంలో బలంగా ఓ వాదన నాటుకుపోయింది. సో, అరిచి గీ పెట్టినా, ఈ ‘పచ్చ’ నిజాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు.