టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. ఏం జరగబోతోంది.?

తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ కలకలం షురూ అయ్యింది. నిజానికి, ఇది కొన్నేళ్ళ క్రితం నాటి వ్యవహారం. అడపాదడపా సినీ పరిశ్రమపై డ్రగ్స్ ఆరోపణలు రావడం, కొన్నాళ్ళపాటు ఆ రగడ కొనసాగడం, ఆ తర్వాత అంతా సైలెంటయిపోవడం పరమ రొటీన్ వ్యవహారమైపోయింది. కానీ, ఈసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. అదేనండీ, ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పలువురు సినీ ప్రముఖులకు ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది.. ఆ ప్రముఖులు నిర్ణీత తేదీల్లో ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. వీరిలో దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాతగా మారిన నటి ఛార్మి, ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్, ప్రముఖ నటుడు రవితేజ.. తదితరులున్నారు. విచారణకు హాజరైనవారంతా నేరస్తులేనని అనడం సబబు కాదు. విచారణ జరగాలి, విచారణలో ఏం జరుగుతుందో తేలాలి. అప్పటిదాకా అంతా సంయమనం పాటించాల్సిందే.

కానీ, అలా సంయమనం పాటిస్తే అది తెలుగు మీడియా ఎందుకవుతుంది.? టాలీవుడ్‌లో డగ్ర్స్ ప్రకంపనలకు సంబంధించి గతంలో ఏర్పాటైన ‘సిట్’ అప్పట్లోనే పలువురు సినీ ప్రముఖుల్ని ప్రశ్నించింది. కొందరి నుంచి ‘శాంపిల్స్’ సేకరించారు కూడా. మరి, ఆ శాంపిల్స్ ఏం తేల్చాయన్నదానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. ఆ కేసుకు సంబంధించే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. డ్రగ్స్ విషయమై చెల్లింపులు ఎలా జరిగాయి.? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయబోతోందన్నది ప్రస్తుతం అందుతోన్న సమాచారం. కాస్సేపటి క్రితమే పూరి జగన్నాథ్, ఈడీ ముందు విచారణకు హాజరయినట్లు తెలుస్తోంది. ఆయన ఏం చెబుతారు.? అన్నదానిపై మీడియా స్పెక్యులేషన్స్ షురూ అయిపోయాయ్. మరోపక్క, బాలీవుడ్‌లో కూడా డ్రగ్స్ కేసు విచారణ ఊపందుకుంది. పలువురి అరెస్టులు, ఇంకొందరికి విచారణలు తప్పడంలేదు. కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇటీవల డ్రగ్స్ కేసులోనే అరెస్టులు జరిగిన విషయం విదితమే.