Vijay Deverakonda : ముగిసిన ఈడీ విచార‌ణ‌.. విజ‌య్‌ దేవ‌ర‌కొండ ఏమన్నారంటే..?

సినీ హీరో విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట హాజరై నాలుగు గంటల పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రచార వ్యవహారంలో ఆయనను శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక నేర పరిశోధన విభాగం (ED) విచారించింది. గేమింగ్ యాప్ ప్రమోషన్‌కు సంబంధించి తీసుకున్న పారితోషికం, కమీషన్ల వివరాలపై అధికారులు లోతుగా ఆరా తీసినట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ బ్యాంక్ లావాదేవీల వివరాలను ఈడీ సేకరించింది. మనీ లాండరింగ్ కోణం నుంచి కూడా విచారణ సాగించినట్లు తెలుస్తోంది. ఇటీవలే నటుడు ప్రకాశ్‌రాజ్‌ను కూడా ఈ వ్యవహారంలో ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తాజాగా విజయ్‌ను కూడా విచారించారు. ఈ నెల 11న రానా దగ్గుబాటికి, 13న మంచు లక్ష్మీకి విచారణ నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో మరికొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు రావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విచారణ అనంతరం మీడియాతో విజయ్ దేవరకొండ స్పందించారు. తాను గేమింగ్ యాప్ మాత్రమే ప్రమోట్ చేశానని.. అది చట్టబద్ధంగానే ఉందని తెలిపారు. గేమింగ్ యాప్‌లను, బెట్టింగ్ యాప్‌లు వేరు వేరని తెలిపారు. ఆ రెండిటికీ తేడా ఉందని.. అధికారులు అడిగిన వివరాలను తెలిపానని విజయ్ పేర్కొన్నారు. మరోవైపు ఈ విచారణపై విజయ్ ప్రశాంతంగా, ధైర్యంగా స్పందించడాన్ని చూసిన ఆయన అభిమానులు సోషల్ మీడియాలో మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందన్నది వేచి చూడాల్సిందే.