Remake Stories : డబ్బింగ్ వేస్ట్, రీమేక్స్ బెస్ట్: టాలీవుడ్ ‘కథ’ మారింది.!

Remake Stories : ‘భీమ్లానాయక్’ సినిమా హిట్టయ్యింది.. ‘వలిమై’, ‘ఈటి’ సినిమాలు తెలుగులో ఘోరంగా దెబ్బతిన్నాయ్.! ఎందుకిలా.? ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలంటే, స్ట్రెయిట్ సినిమాల తరహాలో తెలుగులో ఆడేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

చాన్నాళ్ళ క్రితం రజనీకాంత్ సినిమా ‘రోబో’ తెలుగులో విడుదలైతే, అప్పట్లో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా ఆశ్చర్యపోయాయ్. ఆ స్థాయిలో వసూళ్ళను రాబట్టింది ‘రోబో’ తెలుగులో. డబ్బింగ్ సినిమాలతో బాగా సొమ్ములు గడించి, స్ట్రెయిట్ సినిమాలు తీసే స్థాయికి కొందరు నిర్మాతలుగా ఎదిగిన వైనం చూశాం.

కానీ, ఇకపై డబ్బింగ్ సినిమాలంటే తెలుగు నిర్మాతలు భయపడి పారిపోవాలేమో.! అలా ‘వలిమై’, ‘ఈటి’ సినిమాల వసూళ్ళున్నాయ్. కార్తీ సైతం తెలుగులో సత్తా చాటలేకపోతున్నాడు డబ్బింగ్ సినిమాలతో. విశాల్ సంగతి సరే సరి.!

చిత్రమేంటంటే, డబ్బింగ్ సినిమాలు ఫెయిలవుతోంటే.. రీమేక్ సినిమాలు హిట్టవుతున్నాయి. ‘భీమ్లానాయక్’ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి కూడా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. సో, పలువురు హీరోలు రీమేక్ సినిమాలపై మోజు ప్రదర్శిస్తోంటే, నిర్మాతలూ అదే బాటపడుతున్నారు.

అన్నట్టు తెలుగు సినిమాలు కూడా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇతర భాషల సినిమాలూ తెలుగులోకి డబ్ అయి విడుదలవుతూనే వున్నాయి. అలా డబ్ అవుతున్నవాటి సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువగా వుంటోంది.