Health Binifits: శీతాకాలంలో ఈ లక్షణాలు బాధిస్తున్నాయా.. అయితే ఇది ఆర్థరైటిస్ కి సంకేతం!

Health Binifits: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు , పెరుగుతున్న వాతావరణ కాలుష్యం , జీవన శైలిలో మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఆర్థరైటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి 100 మంది జనాభాలో 30 శాతం మంది ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. చలికాలంలో ఈ వ్యాధి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థరైటిస్ వల్ల అనేక రకాల కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయని రుమటాయిడ్ విభాగం అధిపతి డాక్టర్ ఉమా కుమార్ వెల్లడించారు. సాధారణంగా ఆర్థరైటిస్ వ్యాధి వయసు పెరిగే కొద్దీ ముసలివారిలో ఎక్కువగా కనిపిస్తుంది.. కానీ ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పు రావడం వల్ల యుక్తవయసు ఉన్నవారిని కూడా ఈ సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఆస్టియో ఆర్థరైటిస్ , రెండవది రుమటాయిడ్ ఆర్థరైటిస్.

ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలు తొందరగా కనిపించటం ప్రారంభిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలలో ముఖ్యంగా కీళ్లు వాపు వస్తాయి.. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య ఎక్కువ అవుతుంది. సకాలంలో డాక్టర్ని సంప్రదించి వైద్యం చేయించుకోవటం వల్ల ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి ఎక్కువగా మణికట్టు , వెన్నెముక మీద ప్రభావం చూపుతుంది. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దానికదే కీళ్ల దగ్గర మృదులాస్థి పై దాడి చేయడం వల్ల ఈ వ్యాధి ప్రారంభమవుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి ఎక్కువగా స్త్రీలలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు ఎముకలు , కీళ్ళు ఆకృతిలో మార్పు చెంది పాదాలు , చేతులు , వేళ్ళు వంకరగా మారుతాయి.

అర్థరైటిస్ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం , కీళ్ల నొప్పులు , ఎక్కువగా అలసిపోవడం , కాళ్లు చేతులు తిమ్మిరి ఎక్కటం , నిరంతరం శరీర నొప్పులతో నడవడానికి ఇబ్బంది పడటం , బరువు తగ్గటం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి .

ఈ ఆర్థరైటిస్ వ్యాధి సోకకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి అవసరమైన పోషక విలువలను అందించే ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకోవాలి. బరువు అధికంగా ఉన్నవారు క్రమేపి వారి శరీర బరువును తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో విటమిన్ – డి లోపం ఉండటం వల్ల ఈ ఆర్థరైటిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందువల్ల విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మిలో ఉండటంవల్ల మన శరీరానికి కావలసిన విటమిన్ – డి లభిస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడకుండా ఉంటారు.