దేశంలో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా !

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్ర‌క్రియ భార‌త్‌ లో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ రోజు ఉద‌యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప‌ద్ధ‌తిలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించ‌గానే దేశంలో మొద‌టి వ్యాక్సిన్ తీసుకున్న వ్య‌క్తిగా మ‌నీశ్ కుమార్ అనే పారిశుద్ధ్య కార్మికుడు నిలిచారు. ఆయ‌న వ్యాక్సిన్ వేయించుకోగానే అక్క‌డున్న వారంతా చ‌ప్ప‌ట్లు కొట్టి అభినందించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో పాటు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సమక్షంలో ఈ వ్యాక్సిన్ వేశారు.

అనంత‌రం రణ్‌దీప్‌ గులేరియా కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఎయిమ్స్ లో వ్యాక్సిన్ కోసం పేర్లు న‌మోదు చేయించుకున్న వారు అనంత‌రం వ‌రుస‌గా వేయించుకున్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ సామ‌ర్థ్యంపై నమ్మ‌కం క‌లిగిచేందుకు ఆయ‌న వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఈ సందర్భంగా హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సినేష‌న్ వంటి ప్ర‌క్రియ‌ను సమర్థంగా నిర్వహించడంలో భారత్‌కు గొప్ప‌ అనుభవం ఉందని తెలిపారు. గ‌తంలో పోలియో, స్మాల్‌పాక్స్‌ వంటి వ్యాధుల‌ను అంతం చేశామ‌ని చెప్పారు. కాగా, దేశంలోని ప‌లు ప్రాంతాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఆయా రాష్ట్రాల మంత్రులు, అధికారులు తొలి రోజు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.