ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి వల్ల వయసుతో సంబంధం లేకుండా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అటువంటి ఆరోగ్య సమస్యలలో ఒకటి తెల్ల జుట్టు .చిన్న ,పెద్ద అని వయసు వ్యత్యాసం లేకుండా అందరిని వేధించే సమస్య ఇది. ముసలితనం చాయలుగా చెప్పే తెల్ల జుట్టు, బట్టతల వంటివి లేత వయసులోనే వచ్చేస్తున్నాయి.ఈ క్రమంలోనే చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మరి
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి గల కారణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మారుతున్న జీవన శైలిలో పిల్లలకు చదువు, కోచింగ్ అంటూ వారిని వత్తిడి చేయడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు
తలెత్తుతున్నాయి. అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి స్ట్రెస్ (మానసిక ఒత్తిడి) కారణమని తేల్చారు. మానసిక ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో పాటు తెల్ల వెంట్రుకలు సమస్య కూడా వేధిస్తోంది.
మానసిక ఒత్తిడి మెదడుపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల సింపథిటిక్ నరాలపై ప్రభావం పడుతుంది. దీంతో జట్టులో నల్లదనానికి కారణమయ్యే మెలనోసైట్ స్టెమ్ సెల్స్ తగ్గిపోతాయి. ఇలా ఎక్కువగా జరిగే వాళ్లకు క్రమేపీ జుట్టు తెల్లబడిపోతుందని పరిశోధకలు వెల్లడిస్తున్నారు.
మానసిక వత్తిడి తగ్గించుకోవడం వల్ల తెల్ల జుట్టు రాకుండా అరికట్టడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడమే కాకుండా జుట్టుకు అవసరమైన పోషణ ఇచ్చే ఫాస్ట్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టురాలే సమస్య, జుట్టు నెరవడం వంటి సమస్యలు దూరం చేయవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు.