Health Tips: చిలకడ దుంప (స్వీట్ పొటాటో) చూడటానికి లేత గులాబీ రంగులో ఉంటుంది. ఇది తినటానికి ఎంతో రుచిగా ఉంటుంది. చిలగడదుంప పచ్చిగా లేదా ఉడకబెట్టుకొని తినవచ్చు. చిలకడ దుంప ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మన శరీరానికి ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు చిలగడదుంపలో ఉన్నాయి. తియ్యటి రుచి కలిగి ఉండటం వల్ల చాలా మంది అవి తింటే బరువు పెరుగుతారని అపోహపడుతుంటారు. కానీ అప్పుడప్పుడు తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు. చిలగడదుంప వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చిలగడ దుంపలో యాంటీఆక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతాయి. చిలకడ దుంపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నొప్పులు వాపులు తగ్గించటమే కాకుండా శరీరంలో ఉండే హానికరమైన పదార్థాలను బయటికి పంపుతాయి.
చిలకడ దుంపలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు సమస్యలు అదుపు చేయవచ్చు. సూర్యుడి నుండి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించి చర్మ సంబంధిత సమస్యలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా గర్భవతిగా ఉన్న మహిళలు చిలగడ దుంపలను తినటం వల్ల అందులో ఉన్న విటమిన్ ఎ తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
చిలకడదుంప లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని మితంగా తినటం మంచిది. ఫైబర్ కంటెంట్ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి షుగర్ లెవల్స్ పెరగకుండా అదుపుచేస్తుంది. చిలకడ దుంప వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.