స్వచ్ఛమైన నెయ్యి వల్ల వచ్చే సువాసన చాలా బాగా ఉంటుంది. నెయ్యిని ఆయుర్వేదంలో కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. ఆవు పాల నుండి తయారయ్యే నెయ్యిని దేసి నెయ్యి అని అంటారు. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా సహాయపడుతుంది. సాధారణంగా నెయ్యిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని తినటం వల్ల అధిక బరువు సమస్య పెరుగుతుందని అపోహపడుతుంటారు. నిజానికి దేశీ నెయ్యిలో అధిక బరువు తగ్గించే మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది వ్యాధులతో పోరాడటమే కాకుండా మన జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అయితే నెయ్యిని స్వీట్లు వంటలు చేయడానికే కాకుండా మీ చర్మ రహస్యానికి కూడా ఉపయోగించవచ్చు. నెయ్యిని చర్మం, శిరోజాల సంరక్షణకై ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దేసి నెయ్యిలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దేసి నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. నెయ్యి చర్మం , జుట్టు రెండింటికి కొన్ని మాయా ప్రయోజనాలు కలిగేలా చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో మన పెదవులు పగిలి డ్రై గా ఉండటం గమనిస్తుంటాం. పొడిబారిన పెదవుల పైన ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు నెయ్యిని రాసి పడుకోవడం వల్ల పెదవులు మృదువుగా మారుతాయి.
శీతాకాలంలో చర్మం మొత్తం పొడిబారి దురద వస్తుంది. అటువంటి సమయంలో రాత్రి పడుకునే ముందు పగిలిన పాదాల మీద నెయ్యి బాగా మసాజ్ చేయటం వల్ల రెండు రోజుల్లో తేడా గమనించవచ్చు.
నెయ్యిని మేకప్ రిమూవర్ గా కూడా ఉపయోగించవచ్చు. నెయ్యి కొద్దిగా విటమిన్-ఇ కలిపి మేకప్ రిమూవ్ చేయడానికి అప్లై చేసి దూదితో క్లీన్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో మోహమ్ కడిగివేయచ్చు. కొంతమందికి మోకాళ్లు మరియు మోచేతులు మరియు మణికట్టు దగ్గర చాలా నల్లగా ఉంటాయి . ఈ సమస్యను అరికట్టడానికి టేబుల్ స్పూన్ నెయ్యి, టేబుల్ స్పూన్ టీట్రీ ఆయిల్ కలిపి నల్లగా ఉన్న చోట మర్దన చేయటం వలన నిదానంగా ఆ రంగు మామూలు స్థితికి వస్తుంది.
చాలామందికి పాదాలు పగుళ్లు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు ప్రతిరోజు నిద్రపోయే ముందు పగిలిన చోట పాదాలని గోరువెచ్చని నీటితో బాగా కడిగి ఆరిన తర్వాత నెయ్యి రాసుకోవడం వల్ల పగుళ్లు సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత మీ పాదాలు మామూలు స్థితికి వస్తాయి.
రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి తలపై అప్లై చేయాలి. ఇలా ఇరవై నిమిషాలు అయిన తర్వాత తల స్నానం చేయండి . వారానికి రెండుసార్లు ఇలా చేయడం ద్వారా మీకు ఆకర్షణీయమైన జుట్టు లభిస్తుంది.
నూనెకు బదులుగా రెండు మూడు చెంచాల వెచ్చని నెయ్యితో మీ తలకు మసాజ్ చేయండి. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది ఇంకా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.