ప్రస్తుత కాలంలో ఎదుర్కొనె సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా ప్రధానమైనదిగా చెప్పవచ్చు. వందలో తొంభై శాతం మంది ఈ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఆకర్షణీయమైన నల్లటి కురులు అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, పని ఒత్తిడి వల్ల చుండ్రు ఏర్పడి జుట్టు రాలే సమస్య అధికమవుతోంది. మార్కెట్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూల వల్ల చుండ్రు సమస్య తగ్గుతుందో లేదో అటుంచితే ఇంట్లో చేసుకునే చిన్న చిన్న చిట్కాల వల్ల చుండ్రు సమస్య అరికట్టవచ్చు.
వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. వేపాకుని మెత్తగా నూరి పేస్ట్ చేసుకొని తలకి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటిలో బాగా శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. అదేవిధంగా 2,3 కప్పుల వేపాకుని బాగా మరిగే నీటిలో వేసి ఉదయమే వాటర్ తో స్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య,చర్మ సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి.
నిమ్మరసం ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక కప్పు నీటిలో కలిపి దూదితో మాడుపై మర్దన చేయాలి అలా చేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఐదు టేబుల్ స్పూన్ల వేడిచేసిన నూనె కలిపి మునివేళ్ళతో తలపై మసాజ్ చేయడం వల్ల చుండ్రు సమస్య స్వస్తి చెప్పవచ్చు.
కలబందలో ఆరోగ్యానికి ఉపయోగమైన ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. కలబంద అందానికి, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జు తలకు రాసి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య అరికట్టడమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మెంతులు ఉపయోగించి చుండ్రు సమస్యకు పరిష్కారం కనిపెట్టవచ్చు. 5 టేబుల్ స్పూన్లు మెంతులను రాత్రివేళ నానబెట్టి ఉదయమే వాటిని మెత్తగా రుబ్బి అందులో పుల్లటి పెరుగు కలిపి తలకి రాసి గంట తర్వాత గోరువెచ్చని నీటితోతలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడంవల్ల చుండ్రు సమస్య తగ్గే అవకాశం ఉంది. మెంతులు జుట్టుకు కావలసిన పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.