Vaccination: కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వారితో పాటు 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా రక్షణ కల్పించే విధంగా వారికి కూడా కరోనా టీకా వేయటం జనవరి 3 నుండి ప్రారంభం కానుంది. ఈ టీకాలు వేయటం పిల్లలకు చాలా సురక్షితం అని డాక్టర్లు సూచిస్తున్నారు. పిల్లలు అందరూ టీకాలు వేయించుకునెలా వారి తల్లిదండ్రులు ప్రేరేపించాలి.
సాధారణంగా పిల్లలు టీకాలు వేయించుకోవడానికి భయపడతారు. కానీ పిల్లల తల్లిదండ్రులు టీకాలు వేయించుకోవటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించి వేయించుకునేలా పిల్లల్న ప్రేరేపించాలి.
భారతదేశంలోని కోవిడ్ టాస్క్ ఫోర్స్ కోసం లాన్సెట్ కమిషన్ సభ్యురాలు ప్రొఫెసర్ డాక్టర్ సునీలా గార్గ్ మాట్లాడుతూ..పిల్లలు టీకా గురించి భయపడితే వారికి టీకా గురించి వివరించండి. పిల్లలకి టీకాలు వేయడానికి ముందు వారు సరిగ్గా తిన్నారో , లేదో చూసుకోండి. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకోకూడదనీ ఆవిడ సూచించారు. ఒమిక్రాన్ కేసులు పెరుతుండటం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీపవర్ ఎక్కువగా ఉండాలని , ఇదివరకే ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యతపై టీకాలు వేయాలని ఆవిడ సూచించారు.
టీకాలు తీసుకున్న తర్వాత పిల్లల్లో జ్వరం , ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే భయపడాల్సిన పని లేదు. టీకా వేసిన చేయి వాపు వచ్చి 2 , 3 రోజులు విపరీతమైన నొప్పి కలిగి ఉంటుంది. టీకా వేయించుకున్న పిల్లల్లో ఇటువంటి లక్షణాలు ఉంటే భయపడాల్సిన పనిలేదు. కానీ వాక్సినేషన్ తర్వాత పిల్లల్లో కళ్ళు తిరగటం , అలర్జీ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించటం చాలా అవసరం.
వాక్సినేషన్ తర్వాత పిల్లలు ఒక అరగంట పాటు వాక్సినేషన్ సెంటర్లో ఉండటం మంచిది. వ్యాక్సినేషన్ తరువాత ఏ విధమైన అలర్జీ ,కళ్ళు తిరగటం వంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు వెంటనే స్పందిస్తారు. వ్యాక్సినేషన్ వేయించుకున్న పిల్లలు తప్పనిసరిగా కోవిడ్ నియమాలను పాటించాలి. టీకా వేయించటం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకానీ కరోనా రాదు అని అపోహ పడకుండా కరోనా నియమాలను తప్పనిసరిగా పాటించాలి.