High BP: చిన్నారులు హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా?జాగ్రత్త నిర్లక్ష్యం వద్దు..!

High BP: ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్ల చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వాటిలో ఒకటి అధిక రక్తపోటు. ఈ హైబీపీ సమస్య చాలా మందిలో కనిపిస్తున్న సమస్య. ఇప్పటి వరకు ఇది పెద్దవారి మీదనే ఎక్కువ ప్రభావం చూపించింది. కానీ అందరినీ ఆందోళన కు గురి చేస్తున్న విషయం ఏంటంటే 10 సంవత్సరాల వయసు పైబడిన పిల్లలు కూడా దీని భారిన పడుతున్నారు. సాధారణంగా చిన్నపిల్లల లో హై బీపీ ని గుర్తించడం కాస్త కష్టమైన పనే.

పెద్దలలో రక్తపోటు సమస్యలు వస్తే డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి నిర్ధారించి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే పిల్లల లో ఎటువంటి పరీక్షలు చేయడానికి వీలుపడదు. ఫలితంగా చాలా మంది పిల్లలు దీని బారిన పడి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. రక్తపోటు మీద సరైన అవగాహన లేని వయసులో పిల్లలు దీని బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలలో అధిక రక్తపోటు కు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా కానీ, ఆహారపు అలవాట్ల వల్ల కానీ, ఇతరత్రా జబ్బుల బారిన పడినప్పుడు రక్త పోటు సమస్య భారిన పడి ఉండవచ్చు. అధిక బరువు పెరగడం, కొలెస్ట్రాల్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం, శారీరక శ్రమ చేయకుండా ఒకేచోట ఎక్కువగా కూర్చుని పనిచేయడం కూడా దీనికి కారణాలుగా చెబుతున్నారు. మెదడులో రక్తనాళాల సమస్యలు, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడే చిన్నారులు రక్తపోటు సమస్య కు దారి తీయవచ్చు.

అయితే కొంతమంది పిల్లలలో రక్త పోటు వచ్చినప్పటికి అది తాత్కాలికంగానే ఉంటుంది. డెంగ్యూ లేదా ఇతర వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. దీని కారణంగా చిన్నారులలో గుండె వైఫల్యం చెందే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించి వారికి తగిన వైద్య పరీక్షలు చేపించి రక్తపోటును గుర్తించాలి. వైద్యున్ని సంప్రదించి సమస్యకు తగిన చికిత్స అందించాలి.