ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, బీజేపీల నడుమ మతం, దేవస్థానం అనే రగడ భీభత్సంగా నడుస్తోంది. వైసీపీ ఒకవైపు ఉంటే, టీడీపీ, బీజేపీలు ఎవరికీ వారు రెండో వైపు నిల్చుని యుద్ధం చేస్తున్నారు. ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో తిరుమల డిక్లరేషన్ వివాదం మినహా మరొకటి నడవట్లేదు. తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా వైఎస్ జగన్ ఎందుకు ఇవ్వట్లేదు, తిరుమల నిబంధనలను ఎందుకు పాటించట్లేదు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయినా సీఎం జగన్ నిన్న తిరుమల వెళ్లి డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దీని మీద బీజేపీ, టీడీపీలు ఫెయిర్ అయిపోతుంటే వైసీపీ మంత్రి కొడాలి నాని మధ్యలో దూరి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అంటూ చంద్రబాబుతో మొదలుపెట్టి మోదీ, ఆదిత్యనాథ్ ల మీద కూడా చురకలు వేశారు.
అసలు గతంలో అనేకసార్లు ఉల్లఘించబడిన ఈ డిక్లరేషన్ అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చింది వైసీపీ నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేయరు అంటూ వివాదాన్ని మొదలుపెట్టారు. సరే.. డిక్లరేషన్ మీద సంతకం చేయడం సీఎంగారికి ఇష్టం లేదనే అనుకుందాం. అలాంటప్పుడు సైలెంట్ గా వెళ్లి దర్శనం చేసుకుని, వస్త్రాలు సమర్పించి వచ్చేయాలి. వివాదాలు వద్దు అనుకున్న ఎవరైనా ఇదే చేస్తారు. కానీ వైవీ సుబ్బారెడ్డి జగన్ తిరుమల పర్యటనకు రెండు రోజుల ముందు సంతకం పెట్టరు అంటూ మాట్లాడి వివాదాన్ని లేవనెత్తారు. ఆ తర్వాత మంత్రి కొడాలి నాని ఎంటరై వివాదాన్ని మరింత రక్తి కట్టించారు.
ఏ రాజకీయ నేత నోరు విప్పినా, ఏ ఛానెల్ ఆన్ చేసినా వేరే ముఖ్యమైన సమస్యలు లేనట్టు దీని గురించే చర్చ. దీంతో కీలకమైన అమరావతి అంశం, భూముల కుంభకోణం మీద సీబీఐ విచారణకు ఆదేశాలు, దానిపై కోర్టు స్టేలు వంటి అంశాలు మరుగునపడిపోయాయి. అసలు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో పోలవరం నిధులు, జీఎస్టీ బకాయిల చెల్లింపు, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ద్రవ్యలోటు భర్తీ వంటి ముఖ్యమైన విషయాల్లో కేంద్రం నుండి ఎలాంటి హామీలు తీసుకున్నారు అనేది స్పష్టంగా బయటకు రాలేదు. దీంతో తిరుమల గొడవను అడ్డం పెట్టుకుని ఈ ముఖ్యమైన విషయాల నుండి జనం దృష్టిని మరల్చుతున్నారని, అసలు అమరావతి రైతుల గోడు పూర్తిగా మరుగునపడిపోయిందని, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన డైవర్షన్ రాజకీయాలను కొందరంటున్నారు.