జిల్లాల విభజనతో కొత్త తలనొప్పి అవసరమా.?

రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపై అధికార వైసీపీకి ఓ విజన్ వుందా.? లేదా.? వుంటే, ఇలా తప్పటడుగులు ఎందుకు వేస్తుంది.? అన్న చర్చ జన బాహుళ్యంలో జరగడానికి కారణం, అధికార పార్టీ తీసుకుంటున్న చిత్ర విచిత్రమైన నిర్ణయాలే.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, అప్పటిదాకా వున్న 10 జిల్లాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒరిగినదేమన్నా వుందా.? అంటే, లేదు. కొత్త కలెక్టరేట్లు, కొత్త హంగామా తప్ప.. జనానికి అదనపు ప్రయోజనం ఏమీ లేదన్నది నిర్వివాదాంశం.

అయితే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు తెలంగాణతో పోల్చినప్పుడు. తెలంగాణ ధనిక రాష్ట్రం గనుక, ఏం చేసినా చెల్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనపై ఎలాంటి డిమాండ్లూ లేవు. కానీ, అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళిక రచించారు.

అయితే, వైఎస్ జగన్ ప్రతిపాదన ముక్కీ మూలిగీ.. అటకెక్కింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రతిపాదనకు బూజు దులుపుతున్నట్లే కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకూ.. మొత్తం 13 జిల్లాల్లోనూ పునర్ విభజన జరిగే అవకాశం వుంది.

మొత్తం 25 జిల్లాలుగా ప్రస్తుత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మారబోతోందన్నది అధికార పార్టీ నుంచి అందుతోన్న సమాచారం. ఇలా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు అంటే.. మళ్ళీ రాజకీయ గందరగోళం తప్పకపోవచ్చు. కోర్టు కేసులంటే అదో తలనొప్పి.

అవసరమా ఇదంతా.? అంటే, ప్రభుత్వానికి ఆ వెసులుబాటు వుంటుంది కాబట్టి, ప్రభుత్వం ముందడుగు వేయొచ్చు. కానీ, రాజకీయ రచ్చ మొదలైతేనే.. రాజకీయంగా అధికార పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.