వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తనపై అనర్హత వేటు పడే అవకాశం లేదని చాలాకాలంగా వాదిస్తున్న విషయం విదితమే. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, సొంత నియోజకవర్గం నర్సాపురంకు వెళ్ళి చాన్నాళ్ళే అయ్యింది. కరోనా సహా అనేక కారణాలతో సొంత నియోజకవర్గానికి ఆయన దూరంగా వుంటున్నారు. మరోపక్క రఘురామ, రచ్చబండ పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన ఫలితంగా, రాజద్రోహం కేసునీ ఎదుర్కొంటున్నారు.
పార్టీకి వ్యతిరేకంగా రఘురామ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ, గతంలోనే ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇంకోసారి ఫిర్యాదు చేసిన వైసీపీ, ఈసారి రఘురామపై వేటు పక్కా.. అనే ధీమాతో వుంది. కానీ, రఘురామ మాత్రం తనపై అనర్హత వేటు పడే అవకాశమే లేదంటున్నారు. రఘురామ, వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం. అయితే, ఆయన ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు.
సాంకేతికంగా ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారు. వైసీపీ ఆయన్ను ఇంతవరకు సస్పెండ్ చేసిన దాఖలాల్లేవు. పార్లమెంటులో వైసీపీ విప్ ధిక్కరించి రఘురామ ఓటేసిన సందర్భాలూ లేవు. దాంతో, ఎలా చూసినా రఘురామపై వేటు పడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ మాత్రం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మీద వేటు పడుతుందని కుండబద్దలుగొట్టేస్తోంది. ఈ నేపథ్యంలోనే రఘురామ ఇంకోసారి స్పందించారు. తన మీద అనర్హత వేటు పడే అవకాశమే లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంలేదనీ, పార్టీ అధిష్టానాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తున్నందునే గళం విప్పుతున్నట్లు చెప్పుకొచ్చారు. రఘురామ డిఫెన్సివ్ టాక్టిక్స్ బాగానే వున్నాయిగానీ.. ఎన్నాళ్ళవి పనిచేస్తాయన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.