Corona Virus: 2 సంవత్సరాల క్రితం చైనాలో ఉద్భవించిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఒక్కోసారి ఒక్కో విధంగా రూపాంతరం చెంది వివిధ రకాల వేరియంట్ లతో ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. కరోనా మొదటి రెండవ వేవ్ లలో ప్రపంచ దేశాలలో తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇతర దేశాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
చైనా లాంటి కొన్ని దేశాలలో కరోనా నాలుగవ వేవ్ మొదలయ్యి రోజు రోజుకి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొంతమంది కరోనా బారి నుండి కోలుకున్నపటికి కొన్ని లక్షణాలు మాత్రం వారిలో కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలను లాంగ్ కోవిడ్ లక్షణాలుగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కూడా చాల మందిలో మతిమరుపు, ఏకాగ్రత లేకపోవటం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త చేయవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లాంగ్ కొవిడ్ ప్రభావాలను తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు గుర్తించారు.లాంగ్ కొవిడ్ బాధితుల్లో ప్రతి 10 మందిలో 7 మందిలో ఎక్కుగా మతిమరుపు సమస్యలు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు పరిశోధకులు గుర్తించారు. అంతే కాకుండా ఈ లక్షణాలు ఒక సంవత్సరం లేదా శాశ్వతంగా ఉన్నట్టు కేంబ్రిడ్జి నిపుణులు పేర్కొన్నారు.
కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కూడా జలుబు, దగ్గు, చాతి నొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కూడా దీర్ఘకాలికంగా వేధించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించి ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.