మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు యొక్క రాజకీయ వ్యూహాలు గురించి అందరికి తెల్సు. ఆయన చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు సొంత పార్టీ నేతలకు నచ్చకపోవచ్చు. కానీ ఆయన మాట్లాడే మాటల్లో నిజం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాల విభజనను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన ఒక రకంగా వ్యతిరేకించి దాన్ని జగన్ చేత కూడా ఆమోదింపజేసుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే శ్రీకాళం నుంచి మూడు కీలక నియోజకవర్గాలు పోతాయని, అంతే కాదు, అభివృధ్ధి మూడు దశాబ్దాల వెనక్కు పోతుందని కూడా ఏకంగా పార్టీ వేదికలు ఎక్కి మరీ ధర్మాన ప్రసాదరావు గర్జించారు.
ఇలా అయితే వైసీపీకి పొలిటికల్ గా కూడా ఇబ్బందేనని కూడా చెప్పేశారు. ధర్మాన ప్రసాదరావు ఇలా గట్టిగా చెప్పడం వల్లనే జగన్ కొత్త జిల్లాల విషయంలో కమిటీని ఏర్పాటు చేశారు అంటున్నారు. అంతే కాదు, ఎక్కడ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించమంటున్నారు. ఈ క్రమంలో ఎచ్చెర్లను శ్రీకాకుళంలో ఉంచాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారుట. దాంతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జగన్ దగ్గర వెయిట్ బాగా పెరిగింది అని అంటున్నారు.
ఎచ్చెర్లలో ఉన్న పరిశ్రమలు, ఆదాయ వనరులు, విద్య వసతులు శ్రీకాకులానికి ప్రధానం. శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో ఎచ్చెర్ల కీలక భూమిక పోషిస్తోంది. దీన్ని కనుక విజయనగరానికి ఇచ్చేస్తే శ్రీకాకులానికి ఇక్కట్లు తప్పవన్న విశ్లేషణలు ఉన్నాయి. దీని మీద మొదట ధర్మాన ప్రసాదరావు నోరు తెరచాకా టీడీపీ లాంటి విపక్షాలు కూడా గొంతు కలిపాయి. ఇపుడు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కలుగచేసుకుని శ్రీకాకుళంలో ఎచ్చెర్లను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో ధర్మాన ప్రసాదరావు నోటి ధాటి ఏంటో తెలిసిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని జగన్ చేత ఆమోదింపచేసుకొని జగన్ దగ్గర తన మాటకు, తన నిర్ణయానికి ఉన్న విలువ నిరూపించుకున్నారు.