మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉంటూ గత ఎన్నికల తర్వాత ఆ పార్టీకి దూరమైనా కుటుంబాల్లో దేవినేని కుటుంబం కూడ ఒకటి. దేవినేని నెహ్రు చాలా ఏళ్లపాటు టీడీపీలో కొనసాగారు. కంకిపాడు నుండి వరుస విజయాలు సాధించి ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా వ్యవహరించారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు దేవినేని అవినాష్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుడివాడలో పోటీచేసి ఓడిపోయారు. అవినాష్ విజయవాడ తూర్పు టికెట్ అడిగితే బాబుగారు పట్టుబట్టి గుడివాడ నుండి పోటీకి దింపి ఆయన ఓటమికి ప్రధాన కారణం అయ్యారు. పైగా అక్కడి టీడీపీ నాయకులు అవినాష్ గెలుపు కోసం నిజాయితీగా పనిచేయలేదనే ఆరోపణలు కూడ ఉన్నాయి.
దీంతో తీవ్రంగా నొచ్చుకున్న అవినాష్ చెప్పాపెట్టకుండా పార్టీని వీడి జగన్ చెంతకు చేరుకున్నారు. ప్రజాబలం ఉన్న వ్యక్తులను జగన్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. వారిని నాయకులుగా నిలబెట్టడానికి గట్టిగా కృషి చేస్తారు. అవినాష్ విషయంలో కూడ అదే చేశారు. అవినాష్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఇంకేముంది కోరుకున్న చోట అధికార పార్టీ అండతో పదవి దక్కడంతో అవినాష్ చెలరేగిపోతున్నారు. చంద్రబాబుతో, టీడీపీతో ఉన్న ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని కూడ పక్కనపడేసి ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ మీద నిత్య యుద్ధం చేస్తున్నారు.
తూర్పులో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన బొప్పన భవకుమార్ స్వభావరీత్యా చాలా మెతక. అందుకే గద్దె రామ్మోహన్ ఈజీగా గెలిచేశారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి అవినాష్ రావడంతో అసలు పోటీ మొదలైంది. అవినాష్ ప్రతి చిన్న అంశంలోనూ ఎమ్మెల్యే మీద చిందులు తోక్కేస్తున్నారు. టీడీపీని, చంద్రబాబును ఏకిపారేస్తున్నారు. అవినాష్ లోని దూకుడు నచ్చి వైసీపీ క్యాడర్ ఆయనకు బాగా సహకరిస్తున్నారు. అధినేత సపోర్ట్ ఎలాగు ఉండటంతో జిల్లా నేతలు మంచి సపోర్ట్ ఇస్తున్నారట. ఇక తండ్రి నెహ్రు వర్గం కూడ అవినాష్ వైపే మొగ్గుచూపుతోంది. ఇలా అన్నివైపులా నుండి పుష్కలంగా సహకారం ఉండటంతో అవినాష్ ను తట్టుకోవడం గద్దె రామ్మోహన్ వల్ల కావట్లేదట.
పైపెచ్చు టీడీపీలోనే గద్దెకు చాలా వ్యతిరేక వర్గాలున్నాయి. ఎంపీ కేశినేని నాని పెద్దగా సహకారం ఇవ్వట్లేదు. నియోజకవర్గంలో నేతలు కూడ గతంలో గద్దె చూపిన నిర్లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని ఇప్పడు హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. దీంతో పదవిలో ఉన్నా పసలేని పండులా తయారయ్యారు రామ్మోహన్. ఇక జనం సైతం పనులేవైనా కావాలంటే అవినాష్ దగ్గరకే వెళ్తున్నారు తప్ప గద్దె రామ్మోహన్ ఆఫీస్ గడప తొక్కట్లేదట. దీంతో ఈసారి ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ మాత్రమే కాదు టీడీపీ నుండి ఎవరు నిలబడినా అవినాష్ చేతిలో చిత్తుచిత్తు కావడం ఖాయమంటున్నాయి వైసీపీ వర్గాలు.