ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సార్లు..కొన్ని పరిస్థితులు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు సంకటంగా తయారవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు తీసుకుని ప్రతిపక్షం పనిగట్టుకుని మరీ విమర్శలతో వెంటాడుతోంది. ఆ రకంగానే జగన్ సర్కార్ పై `రౌడీల రాజ్యం` అనే ముద్రను వేసే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఆ ఆరోపణకు తగ్గట్టే జగన్ ఏడాది పాలనలో కొన్ని సంఘటనలు అద్దం పట్టాయి. డాక్టర్ సుధాకర్ పై పోలీసులు ఓవరాక్షన్… నడిరోడ్డుపైనే సుధాకర్ ని చితకబాదడం.. అటుపై అతని మానసిక స్థితి సరిగ్గా లేదని డాక్టర్లతో చెప్పించడం..వాటిని సుధాకర్ ఖండించి వెలుగులోకి తీసుకురావడం వంటి సన్నివేశాలతో జగన్ సర్కార్ అప్రదిష్ట పాలవ్వాల్సి వచ్చింది.
అప్పటికే వరుసగా హైకోర్టులో ఎదురు దెబ్బలు తింటోన్న ప్రభుత్వానికి సుధాకర్ దెబ్బ లెంపకాయలా తగిలింది. అదే అదునుగా చూసుకుని క్రింద స్థాయిలో జరుగుతోన్న తప్పులకు చీటికి మాటికి జగన్ ని ఆడిపోసుకోవడం అనేది టీడీపీకి పనిగా మారిపో యింది. ఇక్కడ ఏ పార్టీ గొప్ప కాదు. ఏ నేత గొప్ప కాదు. కానీ ఈ రాజకీయం అనే ముసుగులో సామాన్యలు బలైపోతున్నారు. పార్టీలు సామాన్యుల్ని పావులుగా వాడుకుంటున్నాయి. సుధాకర్ ని టీడీపీ అలాగే వాడుకుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా సీతానరగానికి చెందిన ప్రసాద్ అనే దళిత యువకుడు వైసీపీ నేత అక్రమంగా తరలిస్తోన్న ఇసుక ట్రాక్టర్ ని పట్టుకున్నాడు.
తప్పును తప్పు అని ప్రశ్నించాడు .దీంతో సీతానగరం పరిధిలోని పోలీసులు అధికార పక్షానికి కొమ్ముకాసినట్లు వ్యవహరించారు. ప్రసాద్ ని అరెస్ట్ చేసి శిరోముండనం చేసి అవమానించారు. దీంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఇదంతా వైసీపీ నేతల పనేనని తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ రాష్ర్టపతికి నక్సలైట్లలో చేరిపోతానని అందుకు అనుమతి ఇవ్వాలని లేఖ లో కోరాడు. ఈ విషయాన్ని ప్రథమ పౌరుడు సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించారు. ఇప్పుడీ వ్యవహారం ఏపీ పోలీసుల అందరి మెడకి చుట్టుకుంది.