తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు అన్నదానిపై బీజేపీకి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి పలువురి పేర్లను వడబోసిన బీజేపీ అధిష్టానం చివరికి అభ్యర్థిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా పేరు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేసులో పలువురు రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ లు ఉండడంతో ఎవరకి అధిష్టానం అవకాశం ఇస్తుంది అన్నదానిపై ఆసక్తి పెరిగింది.
బీజేపీ నిలిపే అభ్యర్థికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని ఇప్పటికే భాగస్వామ్య పక్షం జనసేన స్పష్టం చేయడంతో… కాషాయదళం అభ్యర్థిని ఎంపిక చేసే కసరత్తులు ముమ్మరం చేసింది. జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. ఆయన్ను ఒప్పించి బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆశావాహులంతా తమకే సీటు ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ క్యూ కట్టినట్టు తెలుస్తోంది.
కాగా, బీజేపీ తిరుపతి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు బాగా ప్రచారంలో ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాసరి శ్రీనివాసులు అనేక శాఖల్లో విధులు నిర్వర్తించారు. పదవీవిరమణ చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ వర్గాలు ఓ తుది జాబితా సిద్ధం చేయగా, అందులో దాసరి శ్రీనివాసులుకే అత్యధిక అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.
బీజేపీ అభ్యర్థి రేసులో మాజీ మంత్రి రావెల కిశోర్, అఖిల భారత సర్వీసుల మాజీ అధికారి సునీల్ కుమార్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల బరిలో దిగే తమ అభ్యర్థి పేరును బీజేపీ మరో రెండ్రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది.
అయితే, రాజకీయ విశ్లేషకులు మాత్రం జనసేన తీసుకున్నది చాలా తెలివైన నిర్ణయం అని పేర్కొంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని, ఈ సమయంలో తమ అభ్యర్థిని బరిలో దింపితే బీజేపీపై వ్యతిరేకత కాస్తా తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని జనసేన నిర్దిష్ట అభిప్రాయానికి వచ్చిందని చెబుతున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల బరి నుంచి తెలివిగా తప్పుకున్న జనసేన… బీజేపీని ఊబిలోకి నెట్టిందని రామకృష్ణ వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి.. జనసేన అభ్యర్థిని నిలబెట్టినా ఓట్లు రావని పవన్ కళ్యాణ్ గుర్తించారని.. అందుకే ఆయన ఈ తమ అభ్యర్థిని కాదని.. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు అవకాశం ఇచ్చారని ఆయన అభిప్రాయ పడ్డారు.