సీపీఎస్.! రాజకీయంగా వైఎస్ జగన్‌కి పెద్ద తలనొప్పి కానుందా.?

YS Jagan

అధికారం కోసం ఏం చెప్పాం.? అధికార పీఠమెక్కాక ఏం చేస్తున్నాం.? ఈ విషయమై వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది. నో డౌట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో వున్నా, సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

కానీ, సంక్షేమ పథకాలనేవి ఓట్లను రాల్చుతాయా.? అంటే, ‘ఔను’ అని చెప్పలేం. చంద్రబాబు హయాంలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి.. కానీ, చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాలేకపోయారు. రేప్పొద్దున్న వైసీపీ పరిస్థితి కూడా అంతేనా.? అంటే, ఏమో అంతే కావొచ్చు కూడా.!

రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్ మాట తప్పారు. మూడు రాజధానులన్నారు.. ఆ విషయంలోనూ వెనకడుగు వేయక తప్పలేదు. చెప్పుకుంటూ పోతే, కీలకమైన విషయాల్ని వైఎస్ జగన్ చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్.. ఇవన్నీ చిన్న విషయాలు కావు. ఎన్నికల్లో ఇవి వైసీపీకి చాలా ఇబ్బందికరంగా మారబోతున్నాయ్.

ఆ కోవలోకే సీపీఎస్ రద్దు అంశం కూడా వస్తుంది. అధికారంలోకి వస్తూనే, వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామని వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో నినదించారు. మూడేళ్ళయ్యింది అధికారంలోకి వచ్చి. కానీ, ఇప్పటిదాకా సీపీఎస్ రద్దు కాలేదు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఆందోళన చేస్తోంటే, ఉక్కుపాదంతో అణచివేస్తోంది వైసీపీ సర్కారు. ఈ విషయమై ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వానికి ఉద్యోగులే పెద్ద షాక్ ఇచ్చారన్నది బహిరంగ రహస్యం. రేప్పొద్దున్న వైసీపీకి కూడా అదే షాక్ తప్పేలా లేదు.