Corona 2nd Wave: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ రోజురోజుకీ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. క్రమక్రమంగా గ్రాఫ్ పైకెళ్ళిపోతుంది తప్ప, కిందికి దిగే ప్రసక్తే లేదంటోంది. ఇప్పటికే 4 లక్షల రోజువారీ కేసులకు వచ్చేసింది పరిస్థితి. నేటి పరిస్థితి మరీ దారుణంగా వుండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఇంకోపక్క, కొన్ని రాష్ట్రాలు కరోనా టెస్టులు తగ్గించేస్తుండడం గమనార్హం. ఇంతకీ, కరోనా వైరస్ సెకెండ్ వేవ్ భూతానికి మెడిసిన్ ఏంటి.? ఇంకేముంది.? 130 కోట్ల జనాభా వున్న భారతదేశంలో ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి గనుక లాక్ డౌన్ ఒక్కటే సరైన మందు.. అని అంతర్జాతీయ స్థాయి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి. ఏప్రిల్ మొదటి వారంలోనే ‘లాక్ డౌన్’ కొద్ది రోజులపాటు అమలు చేసి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చి వుండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇప్పుడు అదుపు తప్పిందనీ, లాక్ డౌన్ వల్ల ప్రయోజనం కొంతే వుంటుందనేది సదరు నిపుణుల వాదన. అయితే, దేశంలో సంపూర్ణ లాక్ డౌన్ అనే మాటకు ఆస్కారమే లేదని కేంద్రం చెబుతోంది.
రాష్ట్రాలు తమ అంతర్గత పరిస్థితులకు అనుగుణంగా మినీ లాక్ డౌన్ వంటి నిర్ణయాలు తీసుకోవచ్చన్నది కేంద్రం వాదన. దేశం ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం వున్నందున లాక్ డౌన్ వంటి కీలక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేకపోతోంది. అయితే, రేపు మే 2వ తేదీ గనుక, నాలుగు రాష్ట్రాలు అలాగే ఓ కేంద్ర పాలిత రాష్ట్రానికి జరిగి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తూనే, కేంద్రం నుంచి కీలక నిర్ణయం లాక్ డౌన్ విషయంలో రావొచ్చని అంటున్నారు. కీలక నిర్ణయం అంటే అది లాక్ డౌన్ మాత్రమేనన్నది చాలామంది అభిప్రాయం. ఏమో, మోడీ సర్కార్ ఏం చేస్తుందోగానీ, దేశ ప్రజల్నయితే కరోనా భూతానికి ఇప్పటికే దాదాపుగా బలిపెట్టేసింది.