Covid 19 : కోవిడ్ 19 నుంచి మానవాళికి విముక్తి ఎప్పుడంటే.!

Covid 19 : కోవిడ్ 19 దెబ్బకి ప్రపంచం విలవిల్లాడుతోంది. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడటం అంత తేలిక కాదు. మానవాళికి పెను శాపంగా మారుతోంది కరోనా వైరస్.. అలియాస్ కోవిడ్ 19. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే వున్నాయి. దాంతోపాటే, లాక్ డౌన్లు కూడా.

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల ఆందోళన అవసరం లేదంటూనే, అప్రమత్తంగా వుండాలంటోన్న కేంద్రం, తాజాగా రాష్ట్రాలకు ఓ అప్రమత్తత లేఖ రాసింది. ఈ లేఖలో, ‘అవసరమైతే నైట్ కర్ఫ్యూ పెట్టాలి..’ అని రాష్ట్రాలకు కేంద్రం సూచించడం పెను సంచలనంగా మారింది.

అంటే, మూడో వేవ్ వచ్చేస్తోందనడానికి ఇదే నిఖార్సయిన సంకేతం.. అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూడో వేవ్ వస్తే పరిస్థితి ఎలా వుంటుంది.? రెండో వేవ్ సందర్భంలో యుద్ధ విమానాల్ని, యుద్ధ నౌకల్నీ వినియోగించి.. ఆక్సిజన్ సిలెండర్లను విదేశాల నుంచి రప్పించుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

మూడో వేవ్ అంత తీవ్రంగా వుండకపోవచ్చనే అంచనాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నా, కోవిడ్ 19 తీవ్రత అంచనాలకు మించి ప్రతిసారీ వుంటోంది. దేశమే కాదు, ప్రపంచం కూడా ఈసారి కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా వుంటే తట్టుకోవడం కష్టమే.

ఇదిలా వుంటే, కోవిడ్ 19తో అయిపోదు.. కొత్త మహమ్మారులు పుట్టుకొస్తూనే వుంటాయని ప్రపంచ స్థాయి వైరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.. లాంటి మాటలు పరమ రొటీన్ అయిపోయాయి. ఇంతకన్నా ఇంకెంత జాగ్రత్తతో వుంటాం.? అన్న ఆవేదన జనం నుంచి వ్యక్తమవుతోంది. కానీ, తప్పదు.