తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఇటీవల కరోనా బారిన పడిన విషయం విదితమే. కరోనా వైరస్ ఆయన్ని బాగానే ఇబ్బంది పెట్టింది. డయాబెటిక్ కావడంతో, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినా, వైద్యులు ఇచ్చిన సలహాలు, సూచనలు, చికిత్సతో కోలుకున్నట్లు కేటీఆర్, సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో నిర్వహించిన సోషల్ మీడియా క్వశ్చన్ ఇన్ (ట్విట్టర్) కార్యక్రమంలో పలువురు నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు కేటీఆర్. మానసికంగా, శారీరకంగా ఎలా సన్నద్ధమై, కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు.? అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే, దానికి ఆసక్తికరమైన సమాధానం కేటీఆర్ నుంచి వచ్చింది. అదేంటో తెలుసా.. వైద్య నిపుణుల సహాలు తీసుకోవాలి తప్ప, వాట్సాప్ నిపుణుల సలహాలు కాదట. దాంతోపాటుగా, అతి ముఖ్యమైన విషయం ఇంకోటుంది.. అదే న్యూస్ ఛానళ్ళను చూడటం మానేయడం. వాట్సాప్, ఫేస్ బుక్ వంటి వాటిల్లో వచ్చే అనవసరమైన చెత్త పోస్టుల్నీ చూడొద్దని కేటీఆర్ సలహా ఇచ్చారు. వ్యాయామం చేయాలనీ, సొంత వైద్యం చేసుకోకూడదనీ, కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా మానసికంగా బలంగా వుండేలా చూసుకోవాలనీ కేటీఆర్ చెప్పుకొచ్చారు.
కేటీఆర్ చెప్పింది అక్షర సత్యం. న్యూస్ ఛానళ్ళలో నానా రకాల చెత్తా కనిపిస్తోంది కరోనా వైరస్ గురించి. మరీ ముఖ్యంగా, స్మశానాల వద్ద పరిస్థితిని న్యూస్ ఛానళ్ళు చూపుతోంటే, సున్నిత మనస్కులు మానసిక ఆందోళనలకు గురై ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.