Covid 19: రోజుకి దాదాపు మూడున్నర లక్షల కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా దేశంలో వెలుగు చూస్తున్నాయి. నిజానికి, మొదటి వేవ్ పీక్స్ అంటే లక్ష కేసుల లోపే. రెండో వేవ్ చాలా తీవ్రంగా వుంది. ప్రస్తుతం మూడున్నర లక్షలు అంటే, దీన్ని పీక్ స్టేజ్ అనే భావించాలి. కానీ, పీక్ స్టేజ్ అప్పుడే కాదంటున్నారు నిపుణులు. ఆ లెక్కన పీక్ స్టేజ్ ఎప్పుడు.? ఆ పీక్ స్టేజ్ వచ్చే నాటికి దేశంలో రోజువారీగా నమోదయ్యే కొత్త కేసులు ఎన్ని వుంటాయి.? ఈ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మే 15 నాటికి పీక్ స్టేజ్ వుండొచ్చన్నది ఓ అధ్యయనం అంచనా. కాగా, ఏప్రిల్ చివరి నాటికి పీక్ స్టేజ్ అవుతుందనీ, ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పడతాయనీ మరో అధ్యయనం చెబుతోంది. దేశంలో పరిస్థితి చూస్తోంటే, కరోనా వైరస్ కొత్త ప్రాంతాలకు విస్తరించడమే కాదు, కొత్త మ్యుటేషన్లు కూడా పుట్టుకొస్తున్నాయనే విషయం స్పష్టమవుతోంది.
పొరుగు దేశం శ్రీలంకలో కొత్త మ్యుటేషన్ వెలుగు చూసింది. అది గాల్లో కొన్ని గంటలపాటు వుంటుందట. అదే నిజమైతే, అక్కడినుంచి ఆ వైరస్ భారతదేశంలోకి ప్రవేశించడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. అయితే, ఇవన్నీ భయాలేననీ.. టెస్టులు ఎక్కువగా జరుగుతుండడంతో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయనీ, మరణాల శాతం పెద్దగా పెరగేలదనే అభిప్రాయాలు కూడా కొందరు వైద్య నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
130 కోట్ల మంది జనం వున్న భారతదేశంలో, ఇది నిజంగానే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఆసుపత్రులు నిండిపోయాయ్.. ఆసుపత్రుల ముందు అంబులెన్సుల్లో కరోనా రోగులు వైద్య చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. డాక్టర్లు – పేషెంట్ల నిష్పత్తి దేశంలో ఆందోళనకరమే ఎప్పుడూ. అలాంటిది, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని రక్షించేదెవరు.? వైద్యులు కరోనా బారిన పడటమంటే, అది రోగులకు మరణ శాసనమే.
మొత్తమ్మీద, దేశంలో రోజువారీగా 5 లక్షల కేసులు, ఆ పైన రావడానికి పెద్దగా సమయం పట్టదనీ, పీక్ స్టేజ్ అంతకంటే ఎక్కువే వుండొచ్చనీ అధ్యయనాలు వెలుగు చూస్తున్న దరిమిలా, ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాల్సిందే రానున్న రోజుల్లో.