కోవిడ్ 19 ‘ఒమిక్రాన్’ చుట్టం ఇండియాకి వచ్చేసిందహో.!

నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్ భారతదేశంలోకి అడుగు పెట్టేసింది. ఎన్నిరోజుల క్రితం ఇది దేశంలోకి ‘చుట్టం’లా వచ్చింది.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. కేంద్రం వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం కర్నాటకలో రెండు ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి.

విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో కోవిడ్ 19 ఒమైక్రాన్ వేరియంట్ గుర్తించబడింది. వారితో సన్నిహితంగా మెలిగినవారికీ వైద్య పరీక్షలు నిర్వహించారట. భయపడాల్సిన పనిలేదుగానీ, అప్రమత్తంగా వుండాలంటూ కేంద్రం దేశ ప్రజలకు సందేశంతో కూడిన హెచ్చరిక జారీ చేసింది.

జనం గుమికూడే ప్రాంతాల్లోకి వెళ్ళరాదనీ, మాస్క్ తప్పనిసరిగా ధరించాలనీ కోవిడ్ ప్రోటోకాల్స్ గురించి కేంద్రం పలు సూచనలు చేసింది. అందుకే మరి, నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదని ముందుగా మనం చెప్పుకున్నది. పర్యాటక ప్రాంతాలు కిలకిల్లాడుతున్నాయి.. రాజకీయ పార్టీల సభలకు పెద్దయెత్తున జనాన్ని సమీకరిస్తున్నారు.. ఇవన్నీ జరుగుతున్నాక, ‘జనం గుమికూడే ప్రాంతాలకు వెళ్ళొద్దు..’ అని సూచన చేస్తే ఎలా.?

ఇదిలా వుంటే, తెలంగాణలోనూ ఒమైక్రాన్ వేరియంట్ గుర్తించబడిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో, ఆ వ్యక్తిని ‘టిమ్స్’కి తరలించి, ప్రత్యేకంగా వైద్య చికిత్స అందిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ బాధితుడేనా.? కాదా.? అన్నదానిపై వైద్య పరీక్షలు జరుగుతున్నాయి ఆ వ్యక్తికి.

ఏదిఏమైనా, కరోనా వైరస్ విషయంలో మానవాళి చాలా అప్రమత్తంగా వుండాలి. మనిషి తీరుని బట్టి కోవిడ్ 19 ప్రవర్తన వుంటోంది. మనమే కోవిడ్ 19 వ్యాప్తికి కారణమవుతున్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.