Covid 19 : దేశంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ అత్యంత పకడ్బందీగా జరగడంతో, మూడో వేవ్ వచ్చినాగానీ.. పెద్దగా మరణాల్లేవు. ఆసుపత్రుల పాలైనవారి సంఖ్య కూడా తక్కువే. అయితే, అత్యంత వేగంగా కోవిడ్ 19 మూడో వేవ్ విస్తరించింది, చాలామందికి కోవిడ్ సోకింది. అనారోగ్య సమస్యలు పెద్దగా లేకపోవడంతో, చాలామంది వైద్య పరీక్షల కోసం కూడా వెళ్ళలేదు.. దాంతో కోవిడ్ 19 కేసుల సంఖ్య మూడో వేవ్‌లో మరీ అంత ఎక్కువగా కనిపించలేదు.
అయితే, కోవిడ్ 19 కొత్త వేవ్ మళ్ళీ రాబోతోందట.. అదీ ఆరు నెలల్లోనే సంభవిస్తుందట. అయితే, దాని తీవ్రత ఎలా వుంటుందన్నదానిపై భిన్న వాదనలున్నాయి. మూడో వేవ్ చాలా లైట్‌గా వున్న దరిమిలా, నాలుగో వేవ్ అసలు పట్టించుకునే స్థాయిలో వుండకపోవచ్చన్నది నిపుణుల వాదన.
కాగా, కోవిడ్ 19 విషయంలో తేలిక భావం అస్సలు మంచిది కాదనీ, ఒమిక్రాన్ వేరియంట్ భారతదేశంలో పెద్దగా ప్రభావం చూపకపోయినా, అమెరికాలో మాత్రం రికార్డు స్థాయిలో మరణాలకు కారణమైందని వైద్య నిపుణులు కొందరు హెచ్చరిస్తున్నారు.
అసలు, రాబోయే కొత్త వేరియంట్ తీవ్రత ఎలా వుంటుంది.? అంటే, ఇప్పటికిప్పుడు ఆ విషయమై ఏదీ చెప్పలేం. ఎందుకంటే, కోవిడ్ 19 అనే కాదు.. ఏ వైరస్ అయినా రకరకాలుగా మ్యుటేట్ అవుతుంటుంది. ఆ మ్యుటేషన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రయోగాలు జరుగుతూనే వుంటాయి.
కొత్త వేరియంట్ గురించి సమాచారం బయటకు వచ్చేలోపు, అది ప్రపంచమంతా పాకేస్తుంటుంది. అదే అసలు సమస్య.