కరోనా వైరస్: ఎన్ని మాస్కులు పెట్టుకుంటే సేఫ్.?

Covid 19: Just Face Mask Is Not Enough

Covid 19: Just Face Mask Is Not Enough

కరోనా వైరస్ దేశంలో కోరలు చాస్తున్నా, రోజువారీ కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటేసినా.. దేశంలో ఇంకా ఫేస్ మాస్కుల పట్ల సరైన అవగాహన లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. సోషల్ డిస్టెన్సింగ్ సరిగ్గా పాటించడంలేదు. చేతులు పరిశుభ్రంగా వుంచుకోవాలన్న సోయ కన్పించడంలేదు. అందరూ అలాగే వున్నారని కాదు, కొందరి నిర్లక్ష్యం.. ఖచ్చితంగా అందరికీ శాపమవుతోంది గనుక.. ఏ ఒక్కరు, కరోనా నిబంధనలు పాటించకపోయినా.. సమస్య అందరిదీ అయిపోతోంది. ఇక, ఫేస్ మాస్కుల విషయమై రోజుకో కొత్త సిద్ధాంతం తెరపైకొస్తోంది. కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి సింగిల్ లేయర్ సర్జికల్ మాస్కు సరిపోతుందని తొలుత చెప్పారు వైద్య నిపుణులు.

కొందరైతే, ఓ సాధారణ హ్యాండ్ కర్చీఫ్ సాయంతో, ముక్కు అలాగే నోటిని కప్పి వుంచగలిగితే చాలన్నారు. కానీ, కంటి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని కొత్త అధ్యయనాలు వెలుగు చూస్తున్నాయి. దాంతో, ఎలాంటి ఫేస్ మాస్క్ ధరించాలి.? అన్న ఆందోళన అంతటా నెలకొంది. ఫేస్ మొత్తాన్నీ కవర్ చేసే ప్లాస్టిక్ షీల్డ్ అలాగే దాంతోపాటుగా ముక్కు, నోటిని కవర్ చేసే ఫేస్ మాస్కు, వీటితోపాటు కళ్ళను కప్పి వుంచే గాగుల్స్ ధరిస్తే సంపూర్ణ రక్షణ లభిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క ఫేస్ మాస్కు పెట్టుకోవడమే చాలామందికి కష్టంగా మారిపోయింది. అలాంటిది, ఒక ఫేస్ మాస్కు మీద మరో ఫేస్ మాస్క్.. దానికి తోడు ప్లాస్టిక్ షీల్డ్, కళ్ళకి గాగుల్స్.. అంటే సాధ్యమయ్యే పనేనా.? తప్పదు, మన ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే.. ఇతరుల ప్రాణాల్ని పణంగా పెట్టకూడదంటే.. ఇవన్నీ చేయాల్సిందే. ఇవన్నీ ఎందుకు.? అనుకుంటే, ఇంటిపట్టునే వుండి.. ఇతరుల్ని దగ్గరకు రానివ్వకపోతే సరి.